కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం దీనిని మంజూరు చేసింది. వీటికి తోడు సెంట్రల్ రోడ్‌ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వం గతంలో రూ.830 కోట్లను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కేంద్రం రూ. 400 కోట్లను మాత్రం మంజూరు చేసింది.
సీఎం విజ్ఞప్తితో నేషనల్ గ్రీన్ హైవే పాలసీ కింద రూ.1153 కోట్లను, రోడ్ సేఫ్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 902 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే విడుదల చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని భావిస్తే వాటి వివరాలను తనకు అందజేస్తే తాను చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆగస్టు 23న ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ అంశాలపై వివరంగా చర్చించారు.
రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులు :
సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్- భువనగిరి-చౌటుప్పల్ (నెం. 161, 65) మార్గంలో సుమారు 140 కిలోమీటర్లు చౌటుప్పల్-ఇబ్రహీంపట్నం-ఆమనగల్-షాద్‌నగర్-చేవెళ్ళ-శంకర్‌పల్లి-కంది (నెం. 65) మార్గంలో సుమారు 160 కిలోమీటర్లు, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి-హుస్నాబాద్ (నెం. 563) మార్గంలో సుమారు 130 కిలోమీటర్లు, హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు-వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు-కొత్తగూడెం (నెం.30) మార్గం లో 220 కిలోమీటర్ల మేర మొత్తం 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు చేయడానికి సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.
అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి వెంటనే అనుమతులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి తొలిదశలో 1950 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరు కాగా, తాజాగా 650 కిలోమీటర్ల మేరకు కూడా అనుమతి లభించడంతో రెండున్నరేండ్లలో తెలంగాణకు 2600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరైనట్లయింది. అరవై ఏండ్లలో తెలంగాణకు 2600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరైన రికార్డును కేసీఆర్ ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలోనే సమం చేసింది.