తలాపున కృష్ణమ్మ పారుతున్నా తమ పొలాలకు,తమ నోటికి నీరు అందడానికి 70 ఏండ్లు పట్టింది.ఈ దృశ్యం ఆవిష్కరణకు మంత్రి హరీశ్ రావు కారణం.నల్లగొండ జిల్లాలో చందంపేట పూర్తిగా నల్లమల అడవులను అల్లుకొని ఉండే ప్రాంతం. తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చిన కృష్ణవేణి దీని పక్క నుంచే ప్రవహిస్తుంది. అతిపెద్ద మానవ నిర్మిత జలసౌధం నాగార్జున సాగర్ జలాశయం వెనుక జలాలు సైతం ఈ మండలంలోని కనీసం 10 గ్రామాలను తాకుతాయి. అయినా ఇన్నాళ్లూ కృష్ణా నీరు చందంపేటను పలకరించలేదు.1940వ దశకంలో నిజాం రాజులు నిర్మించిన డిండి జలాశయం ద్వారా డిండి (గుండ్లపల్లి) తోపాటు చందంపేట మండలానికి సైతం తాగు, సాగు నీరు అందించే ప్రణాళిక రూపొందించారు. కాల్వను సైతం నిర్మించారు. కేవలం 1947లో ఒక్కసారి మాత్రమే ఆ కాల్వ ద్వారా చందంపేట మండలానికి చేరిన కృష్ణా జలాలు మళ్లీ ఇంతకాలం ఒక్కసారీ అటువైపు చేరలేదు. ఇటీవల ఎస్సెల్బీసీ పథకంలో భాగంగా ఇదే మండలంలో నిర్మిస్తున్న నక్కలగండి రిజర్వాయర్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వెంటనే కాల్వలలో పూడిక తీయించి చందంపేట మండలంలోని చెరువులు నింపాలని ఇంజినీర్లను ఆయన ఆదేశించారు. తక్షణం యంత్రాంగం స్పందించింది. డిండి మండల శివారు గ్రామాల నుంచి పూడిపోయిన కాల్వను ఆగమేఘాల మీద పూడిక తీయించింది. పనులు చివరి దశలో ఉన్నవి. డిండి మండలం కామేపల్లి నుంచి చందంపేట మండలంలోని ముడుదండ్ల గ్రామానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ నీటిని విడుదల చేశారు. దీంతో 70 ఏండ్ల తర్వాత చందంపేట పాదాల చెంతనే పారుతున్న కృష్ణమ్మ మరోసారి ఆ మండలంలోని చెరువుకు చేరింది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి వచ్చిన నీటితో ప్రస్తుతం డిండి జలాశయం నిండు కుండ వలె తొణికిసలాడుతున్నది. 2.45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 36 అడుగుల ఎత్తయిన డిండి రిజర్వాయర్లో ప్రస్తుతం 32 అడుగుల మేర నీళ్లున్నాయి. డిండి మండలంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైనా జలాశయం నీటితో చెరువులన్నీ నిండాయి. డిండి నుంచి బాపనికుంట చెరువుకు అక్కడి నుంచి దిగువకు కృష్ణమ్మ ప్రవహిస్తుంది. తాజాగా చేపట్టిన కాల్వల పూడికతో ముందుగా ముడుదండ్ల, చందంపేట, ముర్పునూతల, గాగిళ్లాపూర్… ఇలా చెరువులన్నీ నింపుతూ మళ్లీ కృష్ణా నది వరకూ చేరనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇంత వేగంగా తమ ఆవేదనను పట్టించు కుంటుందని,తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఊహించ లేదని రైతులు అంటున్నారు.
ఎస్.కె.జకీర్