విశ్వాస్‌


క్రిస్మస్‌… ఏసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా అవతరించిన ఈ శుభదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. క్రీస్తు జన్మదినమైన డిసెంబర్‌ 25వ తేదీ క్రిస్మస్‌ పండగ కాగా డిసెంబరు నెలారంభం నుంచే ప్రపంచమంతటా క్రిస్మస్‌ సందడి మొదలవుతుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కెథడ్రల్‌ చర్చి కొలువై ఉన్న మెదక్‌ పట్టణంలో ఈ నెలంతా పండగ వాతావరణం నెలకొంటుంది. క్రిస్మస్‌ సమీపిస్తున్న కొద్దీ పట్టణమంతటా ఆ పండగ ప్రభావం కనిపిస్తుంది. పచ్చని క్రిస్మస్‌ ట్రీలు, నక్షత్రాల ధగధగలు, అలంకరణలతో చర్చిలు, ఇళ్లు ముస్తాబవుతాయి. కాగా ఏసయ్య మందిరంగా, కరువు నుంచి ఉద్భవించిన కళాత్మక కట్టడంగా, అన్నార్థులను ఆదుకున్న మహాదేవాలయంగా పేరుగాంచి, చారిత్రక ప్రాధాన్యత కలిగిన మెదక్‌ చర్చిలో 95 ఏళ్లుగా క్రిస్మస్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుండటం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశీయులు సైతం మెదక్‌ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకలను తిలకించేందుకు తరలివస్తారు.

1924 నుంచి…

1914లో ప్రారంభమైన మెదక్‌ చర్చి నిర్మాణం పదేళ్ల పాటు కొనసాగి 1924లో పూర్తయింది. ఆ ఏడాది డిసెంబర్‌ 25వ తేదీ నుంచే ఇక్కడ క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నిరంతరాయంగా ప్రతి ఏటా క్రిస్మస్‌ వేడుకలు కన్నుల పండువగా జరుగుతుండటం విశేషం.


క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపేలా…

మెదక్‌లో చర్చి కొలువై ఉన్న మిషన్‌ కాంపౌండ్‌లోని వెస్లీ హాస్టల్‌ స్టూడెంట్‌లు క్రిస్మస్‌ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ మొదటి వారంలో ఏసు ప్రభువు జన్మవృత్తాంతం తెలియజేసేలా క్రీస్తు కాలంనాటి నగరాలు, గ్రామాల నమూనాలు రూపొందిస్తారు. మట్టి, ఇటుకలు, పెంకులు ఉపయోగించి జీసస్‌ జన్మించిన నాటి ఆసియా ఖండం యూదయా దేశంలోని బెత్లెహేము గ్రామం, క్రీస్తు తల్లిదండ్రులు జోసఫ్‌, మేరీ నివాసం ఉన్న నజరేతు పట్టణం, ఆనాటి రాజ్యపాలనకు కేంద్రమైన జెరుసలేం నగర నమూనాలను రూపొందిస్తారు. కర్రలు, గడ్డితో పశువుల పాకలు నిర్మించి వాటికి స్టార్‌లు వేలాడదీస్తారు. విభిన్నంగా అగుపించే ఆనాటి రాజుల భవనాలు, ప్రజల ఇండ్లు, చర్చి నమూనాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చర్చి సందర్శనకు వచ్చేవారు ఈ నమూనాలను ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు.

నక్షత్రాల దగదగలు…

క్రీస్తు జన్మించినపుడు ఆకాశంలో ప్రత్యేక చుక్క (నక్షత్రం) కనిపించిందట. అందుకు గుర్తుగా క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులు తమ ఇళ్ల ముందు నక్షత్రం ఆకారంలో ఉండే విద్యుత్తు దీపాన్ని అలంకరిస్తారు. క్రిస్మస్‌ నేపథ్యంలో మెదక్‌ చర్చి వద్ద పెద్ద సైజు నక్షత్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, మిషన్‌ కాంపౌండ్‌లో, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే క్రైస్తవుల ఇళ్ల వద్ద, దుకాణాల్లో క్రిస్మస్‌ స్టార్‌లు వెలుగులు విరజిమ్ముతాయి. అలాగే సంప్రదాయం ప్రకారం క్రైస్తవుల ఇళ్లలో, సీఎస్‌ఐ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో పిరమిడ్లు ఉండే క్రిస్మస్‌ ట్రీలను అలంకరిస్తారు. కొందరు ఇంటి ఆవరణలో క్రిస్మస్‌ ట్రీలను పెంచుతారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రిస్మస్‌ ట్రీలను గ్రీటింగ్‌ కార్డులు, గంటలు, బొమ్మలు, రంగురంగుల సీరియల్‌ బల్బులతో అలంకరిస్తారు.

కారెల్స్‌ శుభోదయం

క్రిస్మస్‌ సందర్భంగా మెదక్‌ మిషన్‌ కాంపౌండ్లో నివసించే క్రిస్టియన్లు డిసెంబర్‌ మొదటి వారం నుంచే కారెల్స్‌ సంబరాలు మొదలుపెడతారు. యువకులతో కూడిన కారెల్స్‌ బృందాలు తెల్లవారుజాము నుంచి క్రీస్తు స్తుతి గీతాలు ఆలపిస్తూ ఇంటింటికి వెళ్లి హ్యాపీ క్రిస్మస్‌ అంటూ పండగ శుభాకాంక్షలు చెబుతారు.

యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడుకలు

క్రిస్మస్‌కు వారం రోజుల ముందు యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. చర్చి బిషప్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేస్తారు. ఈ సందర్భంగా సీఎస్‌ఐ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియచేసే నాటికలు ప్రదర్శిస్తారు.

శోభాయమానంగా…

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ మెదక్‌ చర్చిని శోభాయమానంగా ముస్తాబు చేస్తారు. చర్చి ప్రాకారాలకు రంగులు వేస్తారు. పూర్తిగా రాతితో నిర్మితమై 173 అడుగుల ఎత్తున్న చర్చి గోపురాన్ని, 200 అడుగుల పొడువున్న చర్చిని, ప్రాంగణాన్ని రంగు రంగుల విద్యుత్తు బల్బులతో అలంకరిస్తారు. క్రిస్మస్‌కు మూడు రోజుల ముందు నుంచే రాత్రి వేళ చర్చి విద్యుత్తు దీపాల కాంతిలో వెలుగులు విరజిమ్ముతుంది. ఇక డిసంబర్‌ 25వ తేదీన క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలోని ప్రధాన హాలులో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. విశాలమైన చర్చి హాలును, ప్రధాన వేదికను బెలూన్లు, రంగురంగుల మెరుపు కాగితాలతో అలంకరిస్తారు.

పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి

మెదక్‌ చర్చిలో అంగరంగ వైభవంగా జరిగే ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను తిలకించేందుకు, స్పెషల్‌ సర్వీస్‌లో పాల్గొనేందుకు, చర్చి బిషప్‌ అందించే దైవ సందేశాన్ని వినేందుకు చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) మెదక్‌ డయాసిస్‌ పరిధిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆరోజు దాదాపు లక్ష మంది వరకు మెదక్‌ చర్చిని సందర్శిస్తారు.

తెల్లవారు జామునే…

క్రిస్మస్‌ రోజు తెల్లవారు జాము 4 గంటలకు మార్నింగ్‌ సర్వీస్‌తో మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఏ.సి.సాలమన్‌ భక్తులకు దైవవాక్య సందేశం ఇస్తారు. ఉదయం 10 గంటలకు జనరల్‌ సర్వీస్‌ ఉంటుంది. ఆ తర్వాత రాత్రి వరకు భక్తులు చర్చిని సందర్శించి గురువుల దీవెనలు అందుకోవచ్చు.

Other Updates