శరీర నిర్మాణ శాస్త్ర ప్రకారము స్త్రీ, పురుషునికంటే బలహీనురాలు. అందువల్ల ”ఆడది అరిటాకు వంటిది” అని ”ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు” లాంటి సామెతలు వాడుకలోకి వచ్చాయి. పునరుత్పత్తి బాధ్యత ఆడువారిపై ఉండటం వల్ల ఇది ఇలా జరుగుతుంది కాబోలు. అయితే కొన్ని సర్వేల వల్ల తేలిన విషయం స్త్రీలు పురుషుల కంటే మానసికంగా, గొప్ప ‘పరిణతి’ చెందిన వారు. క్రియాశీలురు, సంక్షోభ సమయాల్లో కూడా మెరుగైన ఆలోచనలు చేయగరు.
ఇదే విషయాన్ని అనురాధ (సుజలగంటి) తన నవల ”ఆడదంటే…? సబల”లో నిరూపించారు. రచనా వ్యాసంగం ప్రారంభించి దశాబ్దంలోపే. అయినా, పది నవలలు, ఎన్నో కథలు తెలుగు పాఠకులకు అందించటమేకాకుండా, పలు పురస్కారాలను స్వంతం చేసుకున్నారు. స్త్రీలు, స్త్రీల సమస్యలను తమ రచనలలో ప్రస్తావిస్తూ, ఆశావహ ధృక్పథాన్ని ప్రకటిస్తారు. సమస్యలు ఎదురైనపుడు ”బేరు’ మనకుండా ఆత్మస్థయిర్యంతో ఎదుర్కుంటే వాటిని ప్రభావ పూరితంగా అధిగమించవచ్చునని ప్రభోదిస్తారు. విచక్షణ వివేకంతో తను సరియైన న్యాయం పొందగలనని ఈ నవలలోని మధురిమ అనే పాత్ర నిరూపిస్తుంది.
మాధవి, మధులు భార్య భర్తలు. మంచీ చెడుల విచక్షణ లేకుండా, సంపాదించటమే ముఖ్యం అని భావించే మధుకు తన ఆఫీసులోనే పని చేస్తున్నా, అందమూ, ఆకర్షణా ఉన్న ‘మధురిమ’ అనే యువతి పరిచయం అవుతుంది. నిజాలను దాచి మధు, మధురిమను రహస్యంగా ”పెళ్ళి” చేసుకుంటాడు. మధురిమకు మత్తు మందు ఇచ్చి, పరపురుషులకు ‘ఎర’గా ఆమెను వాడుకుంటూ ఉంటాడు. నిజం తెలుసుకున్న మధురిమ, మాధవిలు, మధును ఎదిరించి తమ తమ కాపురాలను, జీవితాలను చక్కదిద్దుకుంటారు. చివరగా, మధుకు జైలు శిక్షపడుతుంది. మాధవి తన భర్త నిర్వహించే ‘బిజినెస్’ చూసుకుంటుంది. మధురిమ తన శేష జీవితాన్ని ఒక ఆశ్రమ స్థాపన నిర్వహణలో గడుపుతుంది.
– కూర చిదంబరం