డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ

అరటి అరటి కలిస్తే ఏమౌతుంది? ఇది పచ్ఛకుని ప్రశ్న.
ఫుల్‌ టీ అవుతుంది. ఇది అవధాని చెప్పిన సమాధానం.

tsmagazine
ఉద్దండ పిండాలవంటి అతిరథ మహారథులు పచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం బెరుకు లేకుండా సమయోచితంగా సమాధానాలు ఇచ్చి మహామహులను అబ్బురపరిచాడు 18 ఏళ్ళ యువ అవధాని గన్నవరం లలితాదిత్య.

ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఆశుకవిత్వ విద్యకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని, ప్రాచీన సాహిత్య కళలు అజరామరంగా శాశ్వతంగా వర్ధిల్లుతాయనీ, అమూల్యవజ్రాలవంటి ఈ విద్యలకు ఎన్నటికైనా విలువ తగ్గదనీ హైదరాబాద్‌ నగరంలోని రవీంద్రభారతిలో ఇటీవల జరిగిన సంస్క తాంధ్ర ద్విగుణిత అష్టావధానం మరోసారి నిరూపించింది. కాగా, ఈ అవధానాన్ని నిర్వహించిన వ్యక్తి కేవలం 18 సంవత్సరాల నవ

యువకుడు కావడం, అమెరికాలో పుట్టిపెరిగి అక్కడే విద్యనభ్యసిస్తూ ఉండటం మరో విశేషం.

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్క తిక శాఖ సౌజన్యంతో, ఆధ్యాత్మిక మాసపత్రిక దర్శనమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఒక మధుర స్మ తిగా అందరి హదయాలలో నిలిచిపోయింది.

అమెరికాలో టెక్సాస్‌ రాష్ట్రంలోగల హ్యూస్టన్‌లో ఏరోనాటిక్స్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ చదువుతున్న ఈ ఆధునిక యువకుడు సంస్కృతాంధ్రాలలోని వేదపురాణేతిహాస దర్శన కావ్యాదులలోని విషయాలను ఉదాహరిస్తూ ఉద్దండ పండితులవలె అవధానం నిర్వహిస్తాడని ముందుగా ఎవరూ ఊహించి ఉండరు. కానీ వాస్తవంలో దానిని సాకారం చేసిన అవధాని కిశోరం లలితాదిత్యుడు.

సభా ప్రారంభానికి ముందే కిక్కిరిసిపోయిన రవీంద్ర భారతి ప్రాంగణం సభ ప్రారంభించే సరికి అప్పుడే వచ్చినవారికి కూర్చోవడానికి సీట్లు కూడా మిగలలేదు. అయినా ప్రాంగణంలోని కారిడార్లలో ఎందరో సాహిత్యాభిమానులు నిలబడి ఆసాంతం అవధానాన్ని తిలకించి, శ్రవణించి, పులకించిపోయారు. మళ్లీ ఇలాంటి అవధానం జరుగుతుందా? అన్నంత ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆనందతరంగాలలో తేలిపోయారు.

సభా ప్రారంభంలో విద్యార్థుల భక్తి గీతాలాపన మధురంగా సాగింది. అవధాన సమన్వయ కర్త, ప్రముఖ సాహితీ వేత్త మరుమాముల దత్తాత్రేయ శర్మ సభను ప్రారంభిస్తూ యువ అవధాని గన్నవరం

లలితాదిత్య ప్రతిభా నేపథ్యాన్నీ, విశిష్టతనూ వివరించారు. అనంతరం ప్రారంభ సభలో ముఖ్యాతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా|| కె.వి. రమణాచారి, ఇతర అతిథులు జ్యోతి ప్రకాశనం చేసి సభను ప్రారంభించారు. అనంతరం సబాధ్యక్షులు మహామహోపాధ్యాయ, సంస్కృతాంధ్ర శతావధాని, సంస్కృతాంతరంగులు డా|| దోర్బల ప్రభాకర శర్మ అనర్గళంగా సంస్కృతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సనాతన భారతీయ సంస్కృతిలో అవధాన కళకు గల పవిత్రతనూ, విశిష్టతనూ తెలియజేశారు. అనంతరం ముఖ్యాతిథి మాట్లాడుతూ, ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తూనే సంస్కృతాంధ్ర సాహిత్యాలలో కృషి చేసి, అతిచిన్న వయస్సులోనే సంస్కృతాంధ్రాలలో అష్టావధానాలను అలవోకగా చేయడం వెనుక లలితాదిత్య కృషిని కొనియాడారు. అతణ్ణి తీర్చిద్దిన తల్లిదండ్రులను ప్రశంసించారు. గౌరవాతిథి వనం జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తున్న యువ అవధాని ప్రతిభ అత్యంత ప్రశంసనీయమని అన్నారు.

ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్కవి, అష్టావధాని డా|| అయాచితం నటేశ్వర శర్మ మాట్లాడుతూ, చిరు ప్రాయంలోనే ఇంతటి ప్రతిభను కనబరచడం సామాన్య విషయం కాదనీ, ఆదిత్యను అవధాన రంగంలో తీర్చిదిద్దిన మహానుభావులైన అవధానులు ఎందరో ఉన్నారనీ, వారందరూ ప్రశంసార్హులనీ, ఆదిత్య భవిష్యత్తులో ఇంకెంతో ఉన్నతస్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతాడనీ ఆశీస్సులు అందించారు. మరొక ఆత్మీయాతిథి వేదద్యుమణి, సంస్కృత భారతి అధ్యక్షులు నరేంద్ర కాప్రే యువ అవధానిని ప్రశంసించి, ఆశీస్సులు అందించారు. మరో ఆత్మీయ అతిథి డా|| పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ యువ అవధానిని పద్యాలతో ఆశీర్వదించారు.

ప్రారంభ సమావేశానంతరం ప్రముఖ శతావధాని డా|| జి.ఎం. రామశర్మ సంచాలకత్వంలో అవధానం ప్రారంభమైంది. తొలుత అవధాన ప్రక్రియా విశిష్టతనూ, అవధాన కళా వైభవాన్నీ వివరంగా రామశర్మ తమ ప్రసంగంలో ఉదాహరించి, లలితాదిత్యను ఆశీర్వదిస్తూ ఆశువుగా పద్యాలను పఠించారు.

అనంతరం యువ అవధాని లలితాదిత్య ప్రార్థన పద్యగానంతో అవధానం ప్రారంభమైంది. ఇష్టదేవతలనూ, తల్లి దండ్రులనూ, పూజ్య గురువులనూ, ప్రేరకులనూ, తన ప్రార్థనలో యువ అవధాని స్మరించుకున్నారు.

తొలుత తెలుగు అవధానం, పిదప సంస్కృతావధానం రీతిలో ప్రశ్నలను ప్రాశ్నికులు అవధానికి సంధించారు. తెలుగు అవధానంలో డా|| ఆచార్య ఫణీంద్ర నిషిద్ధాక్షరినీ, కంది శంకరయ్య సమస్యనూ, చింతా రామకృష్ణారావు దత్తపదినీ, డా|| పులిగడ్డ విజయలక్ష్మి వర్ణననూ, డా|| నలువోలు నరసింహా రెడ్డి ఆశువునూ, గజవెల్లి శారద న్యస్తాక్షరినీ, సురభి శంకర శర్మ పురాణపఠనాన్నీ, రంగి సత్యనారాయణ అప్రస్తుత ప్రసంగాన్నీ నిర్వహించారు.

పిమ్మట సంస్కృత అవధానంలో డా|| ముదిగొండ అమరనాథశర్మ నిషిద్ధాక్షరినీ, ముత్యంపేట గౌరీ శంకర శర్మ సమస్యనూ, సాధన నరసింహాచార్య దత్తపదినీ, డా|| ఇందారు శ్రీనివాస రావు వర్ణననూ, డా|| ఎస్‌. బి. శ్రీధర్‌ అశువునూ. మావుడూరి సూర్యనారాయణ మూర్తి న్యస్తాక్షరినీ, డా|| ఆచార్య వేణు అంత్యాక్షరినీ, చిక్కా రామదాసు స్వీయ కవితాగానాన్నీ నిర్వహించారు.

దాదాపు మూడు గంటల పాటు సహృదయులైన శ్రోతలను ఆశ్చర్యానందాలలో ముంచివేస్తూ, కదలకుండా చివరిదాకా రంజింపజేసిన ఈ అవధానకేళి ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణిని సైతం ఆకట్టుకొని, ప్రశంసలను అందుకొన్నది. అవధానాన్ని నిర్వహిస్తున్నంతసేపు ఈ యువ అవధానిలో ఏమాత్రం బెరుకుదనం కనబడలేదు.

ఉద్దండపిండాల వంటి పండిత ప్రకాండులూ, అవధానులూ సంధించిన ప్రశ్నలకు ఒక పరిణతావధాని వలె ప్రసన్నంగా సమాధానాలను చెప్పడాన్ని తిలకించిన సభా ప్రాంగణం హర్షధ్వానాలతో పులకించిపోయింది. బాణం ఎక్కుపెట్టి సంధించగానే లక్ష్యాన్ని తాకినట్లు ప్రాశ్నికులు అడిగిన ప్రశ్నపరంపరలకు సత్వరమే సమయోచితంగా సమాధానబాణాలను ప్రయోగించిన తీరు సభను ఆశ్చర్యంలో ముంచివేసింది.

గగన గంగా సదృశధార, అసాధారణ ధారణ శక్తి, మధురవచోధోరణి అన్ని విధాలుగా ఈ అవధానాన్ని రసవత్తరం చేసింది. ‘అరటి, అరటి కలిస్తే ఏమౌతుందనే అప్రస్తుత ప్రశ్నకు ఫుల్‌ టీ అవుతుందని’ అవధాని చెప్పిన సమాధానం ఎంతగానో ఆకట్టుకొంది. పద్యాల పూరణలోనూ ఎక్కడా తడబాటు, సందిగ్ధత కానరాలేదు. అపార ప్రతిభా వ్యుత్పత్తి, అభ్యాసాల పర్యవసానంగా ఈ యువ అవధాని ప్రౌఢులను మించి పోయాడనిపించింది. పూరణల అనంతరం పద్యాల ధారణను సైతం ఆరు నిమిషాలలో శరవేగంగా పూర్తి చేసి సభను అన్ని విధాలుగా లలితాదిత్యుడు అకట్టుకొన్నాడు. ఏడు గంటలకు ప్రారంభమైన సభ పదిగంటల వరకు ఏకధాటిగా మూడు గంటలపాటు నిర్విరామంగా, అహమహమికగా, ఆసక్తిగా సాగింది.

అవధాన కార్యక్రమానంతరం ప్రాశ్నికులు, అతిథులు యువ అవధానిపై ప్రశంసల వర్షాన్ని కురిపించి, అభినందించారు. అనంతరం నిర్వాహకులు యువ అవధానిని ఘనంగా సత్కరించారు. పొల్గొన్న ప్రాశ్నికులను సన్మానించారు. చివరికి నిర్వాహకుల వందన సమర్పణతో ఈ అష్టావధాన సభ ఒక మధురస్మృతిగా అందరి హృదయాలలో నిలిచిపోయింది.

Other Updates