సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న నీటి వాటాను వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తేనే, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, సాగునీళ్లు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఈ టర్మ్ లో అన్ని ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. దీనికి అధికారులు, వర్క్ ఏజన్సీలు సహకరించాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు, మంచినీటికి కూడా ఎంత నీరు అవసరమవుతుందో లెక్కకట్టి, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏ ప్రాంతంలో అయినా ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఆలస్యమైనా సరే, చెరువులు నింపడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరగాలని చెప్పారు.
తెలంగాణలో కోటి ఎకరాల్లో నీరు పారించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఐదేళ్ల పూర్తి సమయం మనకుంది. రాజకీయ సుస్థిరత ఉంది. నిధులకు కొరతలేదు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా పనిచేయడానికి పునరంకితమవుదాం..
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పనులను స్వయంగా సందర్శించి వచ్చిన రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతీ ప్రాజెక్టు పురోగతిపై రిటైర్డు ఇంజనీర్ల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ లోపం ఉందో చర్చించి, అక్కడికక్కడే లోపాన్ని సవరించడానికి అధికారులకు సూచనలు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతున్న చోట, జాప్యానికి కారణాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే వర్క్ ఏజన్సీలను మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
”తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాల తరబడి పోరాడారు. ప్రాణాలు కూడా అర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సాగునీరు వస్తుందని ఆశ పడ్డారు. మొదటి టర్మ్ లో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించే పనులు చేపట్టాం. అన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికున్న విశ్వసనీయతను ప్రజలు గుర్తించారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం ఈ ప్రభుత్వం వల్లనే అవుతుందని నమ్మారు. 75 శాతం ఇదే కారణంతో టిఆర్‌ఎస్ కు మళ్లీ ఓటు వేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, సాగునీరు అందించాం. వలసలు పోయిన వారు వాపస్ వచ్చారు. ఈ పరిస్థితి చూసే అక్కడి ప్రజలు 13 సీట్లలో టిఆర్‌ఎస్ ను గెలిపించారు. ఈ టర్మ్ లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, తెలంగాణలో కోటి ఎకరాల్లో నీరు పారించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఐదేళ్ల పూర్తి సమయం మనకుంది. రాజకీయ సుస్థిరత ఉంది. నిధులకు కొరతలేదు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా పనిచేయడానికి పునరంకితమవుదాం” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
”తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. సాగునీటి రంగంలో వివక్షకు గురైంది. అందుకోసమే ఇక్కడి ప్రజలు పోరాటం చేశారు. కాబట్టి తెలంగాణలో ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని ప్రధాని మోడీకి అనేక సార్లు చెప్పాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 20-30 వేల కోట్లిచ్చి సాయపడండి అని వేడుకున్నా. అయినా సరే నరేంద్రమోడి డబ్బులు ఇవ్వలేదు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశమంతా మెచ్చుకున్నది. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వరంగల్ జిల్లా చెరువులో పుట్టిన రోజు చేసుకుని మిషన్ కాకతీయ పనులను మెచ్చుకున్నారు. దేశమంతా ప్రశంసించారు. నీతి ఆయోగ్ కూడా మిషన్ కాకతీయ గొప్ప పథకమని చెప్పింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.24వేల కోట్లివ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినా సరే, నరేంద్ర మోడీ ప్రభుత్వం 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈ సారి కేంద్రంలో మనది క్రియాశీల పాత్ర ఉంటుంది. కావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన రాష్ట్ర ఆదాయాభివృధి రేటు కూడా బాగుంది. మొదటి నాలుగు సంవత్సరాలలో 17.17 శాతం వృధిరేటుంటే, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 29.17 శాతం వృధి రేటు నమోదైంది. నిధులకు కొరతలేదు. ప్రాజెక్టులు కట్టుకోవడమే మన లక్ష్యం” అని చెప్పారు.
”గోదావరి నదిలో తెలంగాణకు 950 టిఎంసిల నీటి వాటా ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఇది ఖరారైంది. దీని ప్రకారమే మనం గోదావరిపై కాళేశ్వరం, తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించాలి. హైదరాబాద్‌కు తాగునీరు అందించాలి. ఇదే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది ఎండాకాలంలోనే పనులన్నీ పూర్తి చేసి, వర్షాకాలంలోఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు చెరువుల ద్వారా పొలాలకు చేరాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్ ల నిర్మాణం పూర్తి కావాలి. ఎల్లంపల్లి, మిడ్ మానేరు దాకా నీళ్లు రావాలి. మేడిగడ్డ నుంచి ప్రతీ రోజు రెండు టిఎంసిల చొప్పున నీరు తీసుకోవాలి. మూడు బ్యారేజిల ద్వారా 36 టిఎంసిల నీళ్లు, ఎల్లంపల్లిలో 20 టిఎంసిల నీళ్లు నదిలోనే అందుబాటులో ఉంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు పంపు చేసి చెరువులకు మళ్లించాలి. ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టిఎంసిని మిడ్ మానేరు ద్వారా శ్రీరాం సాగర్ కాల్వలకు మళ్లించాలి. మరో టిఎంసి నీళ్లను మల్లన్న సాగర్ వైపు మళ్లించాలి. మల్లన్న సాగర్ ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ కు తరలించాలి. మల్లన్న సాగర్ ద్వారానే హైదరాబాద్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టిఎంసిల రిజర్వాయర్ కు నీళ్లు పంపాలి. హల్ది వాగు ద్వారా నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందించాలి. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులు నింపాలి. వాటి ద్వారా క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తూ మూసీ నది మురికిని వదిలించాలి. మూసీ రివర్ ఫ్రంట్ ను అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా అభివృద్ధి చేస్తాం. దానికి కూడా గోదావరి నీళ్లు అందాలి. చివరికి మూసీ నది నీళ్ల ద్వారా పాత నల్లగొండ జిల్లా పొలాలకు నీరు చేరాలి” అని ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని వివరించారు.
”గోదావరి నదిపైనే నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఉపయోగించుకోవడానికి బ్యారేజి కడుతున్నాం. ఏడాదికి 75 టిఎంసిలకు పైగా నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న డిజైన్లు, కాల్వలు, ఇతర నిర్మాణాలు పెద్దగా ఉపయోగపడేలా లేవు. మొత్తం పాత వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీరు అందించాలి.
”గోదావరి నదిపైనే నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఉపయోగించుకోవడానికి బ్యారేజి కడుతున్నాం. ఏడాదికి 75 టిఎంసిలకు పైగా నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న డిజైన్లు, కాల్వలు, ఇతర నిర్మాణాలు పెద్దగా ఉపయోగపడేలా లేవు. మొత్తం పాత వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీరు అందించాలి. పాకాల, రామప్ప, గణపురం, లక్నవరం చెరవులను నింపాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నిర్మించి, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాలకు నీరివ్వాలి. దీనికోసం మొత్తం ప్రాజెక్టును రివ్యూ చేసి, కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలి” అని ఆదేశించారు.
”దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలి. మే నెలలో కూడా దుమ్ముగూడెం వద్ద ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలి. బయ్యారం వరకు నీటిని తీసుకురావాలి. ఎస్‌ఆర్‌ఎస్పి ఆయకట్టుకూ నీరు అందాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
”ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి (ప్రస్తుత వికారాబాద్) జిల్లాలకు సాగునీరు అందివ్వడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వేగం పెరగాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో ప్రభుత్వంపై ఎంతో నమ్మకం వచ్చింది. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి, మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. శ్రీశైలం సోర్సు నుంచి 70 టిఎంసిల వరకు తీసుకునే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టును ఆ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులే కోర్టుల్లో కేసులు వేసి, అడ్డుకున్నారు. దానివల్లే కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నంత వేగంగా ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం సాగాలి. అవసరమైన నిధులను ఈ బడ్జెట్లోనే కేటాయిస్తాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలని సీఎం ఆదేశించారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగునీటితో పాటు, తాగునీటికి ఎంత నీరు అవసరమవుతుందో, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అంచనాలు తయారు చేసి, నీటి కేటాయింపు జరపాలని సీఎం కోరారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్సిలు మురళీధర్ రావు, అనిల్ కుమార్, హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, సలహాదారు పెంటారెడ్డి, సిఇలు వెంకటేశ్వర్లు, జి. శ్రీనివాస రెడ్డి, బి. శంకర్, కె. బంగారయ్య, వి. సుధాకర్, వి. నర్సింహ, ఆర్. మధుసూదన్ రావు, వి. రమేశ్, టి. ఖగేందర్, రిటైర్డు ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, వెంకటరామారావు, వేణుగోపాలరావు, రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటేశం, సత్తిరెడ్డి, రమణానాయక్, ఎస్. ముత్యంరెడ్డి, జగదీశ్వర్, జియావుద్దీన్, ఇంద్రసేనారెడ్డి, కెప్టెన్ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.