తాము ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, అయితే ఇన్ని రోజుల్లోగానే నెరవేరుస్తామని చెప్పమని, అన్ని కోణాలలో ఆలోచించి పటిష్టంగా అమలుపరుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు తొందరపెడితే తాము తొందరపడమన్నారు. గత ప్రభుత్వ కాలంలో తాము మేనిఫెస్టోలో పేర్కొనని 76 పథకాలను ప్రజల కోసం అమలు చేసిన ప్రభుత్వం తమదని అన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు మేలుచేసే పలు పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుల భూ రికార్డుల ప్రక్షాళన ఎన్నో భూ సమస్యలను పరిష్కరించిందన్నారు. త్వరలో ధరణి వెబ్‌సైట్ ద్వారా రైతులకు కావాల్సిన భూ సమాచారమంతా దొరుకుతుందన్నారు. భూమి యాజమాన్య బదలాయింపు ఇక సులభతరమవుతుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, కేసీఆర్ కిట్, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు తదితర పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెలిపారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామన్నామని, ఒకేసారి మాఫీచేయాలా, విడతలుగా మాఫీ చేయాలా ఆలోచిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో 17వేల కోట్ల రుణమాఫీ చేయగా, ఈసారి అది 24వేల కోట్లకు చేరుతుందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మరో ఆరునెలలు సమయం తీసుకుంటుందన్నారు. దీనికి విధివిధానాలు రూపొందించాల్సి ఉందన్నారు.
మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు ఇతర రాష్ట్రాల వారు చూసి వెళుతున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా కూడా వృద్ధిరేటు 29.93 ఉందన్నారు. జీఎస్‌టీ వసూళ్ళలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కంటివెలుగు పథకంతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి సమస్యలు తొలగించడానికి కార్యక్రమం రూపొందించా మని, అది విజయవంతంగా అమలు జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంబంధించి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు.
సాగునీటికి పెద్ద పీట వేస్తున్నామని, రాబోయే అయిదు సంవత్సరాలలో లక్షా 17వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుచేయనున్నామన్నారు. మనకు కేటాయించిన నీటివాటాను సంపూర్ణంగా ఉపయోగించు కుంటామన్నారు. కేంద్ర బడ్జెట్ తరువాతే పథకాల అమలు ప్రారంభమవుతుందన్నారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అద్దం పట్టిందని పేర్కొన్నారు.
అంతకు ముందు గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, మజ్లిస్ సభ్యుడు బలాల, బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌లతో పాటు టీఆర్‌ఎస్ వైపున కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డిలు ప్రసంగించారు.