హైదరాబాద్‌ నగరంలో ఇటీవల ఈదురుగాలులతో కూడిన ఆకస్మిక వర్షాలకు కూలిన 630 చెట్లను రికార్డ్‌ స్థాయిలో తొలగించడం, రోడ్లపై ఏర్పడ్డ నీటి నిల్వలను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు, కూలిన విద్యుత్‌ స్తంభాలు, ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ను తొలగించడం తదితర చర్యలను చేపట్టడం ద్వారా జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ దేశంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది.

ముంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనంతరం విపత్తుల నిర్వహణ కై ప్రత్యేక విభాగం కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనే ఏర్పాటైంది. దాదాపు 220మంది సిబ్బందితో 8 బృందాలు నగరంలోని 24 కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్ట్‌లుగా విధినిర్వహణలో ఉంటాయి. అయితే ఏప్రిల్‌ 22 న కేవలం అరగంట వ్యవధిలోనే 70కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన అకస్మిక వర్షం కురియడంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్రాతాల్లో ఉన్న విపత్తుల నివారణ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై పడ్డ చెట్లను, తెగిపడ్డ విద్యుత్‌ తీగలు, స్తంభాలను వెంటనే తొలగించాయి.

ఈ వర్షాల సందర్భంగా జీ.హెచ్‌.ఎం.సీ ఈ.వి.డీ.ఎం కంట్రోల్‌ రూంకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 130కి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులన్నింటిని 36 గంటల్లోనే పరిష్కరించడంతో పాటు దాదాపు 622 కూలిన చెట్లను పూర్తిగా తొలగించారు. ప్రధానంగా రామంతపూర్‌లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్న భారీ రావిచెట్టు కూలింది. అత్యంత పురాతన ఆలయంలో ఉన్న ధ్వజస్తంభంపైన, గుడిపైన చెట్ల కొమ్మలు పడకుండా అత్యంత జాగ్రత్తగా కూలిన వృక్షాన్ని డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు తొలగించాయి. దీంతో పాటు అడిక్‌మెంట్‌ రామాలయంలో ఉన్న 40ఏళ్ల చెట్టు కూడా కూలడం, ఈ కూలిన వృక్షాన్ని దేవాలయానికి గాని, పరిసర ప్రాంతాల ఇళ్లపై కానీ పడకుండా సురక్షితంగా తొలగించారు.

లక్డికాపూల్‌లోని క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద భారీ వక్షం కూలి రెండు ప్రధాన రహదారులను బ్లాక్‌ చేయడంతో ఫిర్యాదును అందుకున్న వెంటనే డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సంఘటన స్థలానికి చేరుకొని అతితక్కువ సమయంలో కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశాయి. జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటైన కేవలం సంవత్సర కాలంలోనే ఈ విభాగంలోని 220 మంది సిబ్బందికి విపత్తుల నిర్వహణలో సుశిక్షకులుగా చేయడంతో నగరంలో ఏవిధమైన విపత్తులు సంభవించినా సమర్ధవంతంగా ఎదుర్కునే ఫోర్స్‌ జీహెచ్‌ఎంసీ కలిగి ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. విపత్తులను ఎదుర్కో వడానికి కావాల్సిన అత్యాధునిక మిషనరి, టూల్స్‌లను కూడా సేకరించుకోవడం జరిగిందని, ఈ విపత్తు నివారణ బృంద సభ్యుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు విశ్వజిత్‌ తెలియజేశారు.

హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కునేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సిద్ధంగా ఉందనే స్థైర్యం నగరవాసుల్లో ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డి.ఆర్‌.ఎఫ్‌ బృందాలు అందించిన సేవలను నగరంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజానీకం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలియజేశారు.

Other Updates