tsmagazineఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ జనరల్‌ శ్రవణ్‌ కుమార్‌ వర్మ జనవరి 25న లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్‌ కుర్నూల్‌ జిల్లా అచ్చంపేట అటవి డివిజన్‌ లో ఉన్న 205.4811 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనని ఫారెస్ట్‌ అడ్వైసరీ కమిటీ (ఖీూజ) పరిశీలించి 2018 ఏప్రిల్‌ నెలలో మొదటి దశ అటవీ అనుమతిని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు కు తుది అటవీ అనుమతిని మంజూరు చేసింది.

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే
పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్న మొదటి స్టేజి పంప్‌ హౌస్‌, నార్లపూర్‌ వద్ద అంజనగిరి జలాశయం నిర్మాణం, నార్లపూర్‌ అంజనగిరి – ఏదుల వీరాంజనేయ జలాశయం మధ్య టన్నెల్‌ తవ్వకానికి ఈ అటవీ భూముల బదిలీ అవసరమైంది. ఈ అనుమతితో 204.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు ఆధీనంలోకి రానున్నది. ప్రాజెక్టు పనుల పురోగతికి ఈ అనుమతి దోహదం చేయనున్నది. ఇకపోతే పర్యావరణ అనుమతికి సంబంధించి ఇప్పటికే స్టేజ్‌ -1 అనుమతి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తుది పర్యావరణ అనుమతి కోసం పర్యావరణ ప్రభావ నివేదికను నీటిపారుదల శాఖ తయారు చేస్తున్నది. త్వరలోనే ఈ నివేదికను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నది. అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని, కాబట్టి ఈ పనులని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)లో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కొనసాగుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాగునీటి సరఫరా కోసం మాత్రమే పనులను చేపట్టిందని, పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన తర్వాతనే సాగునీటి పనులను చేపడుతుందని ఎన్‌జిటికి తెలిపింది. ఈ కేసుల నేపథ్యంలో అటవీ అనుమతి కీలకమైన ముందడుగుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
tsmagazine

ఈ టర్మ్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 7వ తేదీన సాగు నీటి శాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశించారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సహస్ర చండీ యాగం తుది రోజున ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ హర్షం వెలిబుచ్చారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖా మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కషిలో పాలు పంచుకున్న నీటి పారుదల శాఖ, అటవీ శాఖ అధికారులను కూడా అభినందించినారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వివరాలు :

తొలుత ప్రాజెక్టుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసి మూడు జలాశయాల్లో నిల్వ చేయాలని నిర్ధేేశించినారు. మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూప కల్పన జరిగింది. అయితే జూరాల జలాశయంపై ఇప్పటికే ఒక లక్ష ఎకరాల స్వంత ఆయకట్టుతో పాటు 2 లక్షల ఎకరాల నెట్టెంపాడు, 2 లక్షల ఎకరాల బీమా, 50 వేల ఎకరాల కోయిల్‌ సాగర్‌, మహబూబ్‌ నగర్‌ పట్టణ తాగునీరు తదితర అవసరాలను తీర్చేఅధిక భారం ఉండటం వలన, ఈ చిన్న జలాశయం నుంచి రోజుకు 1.5 టిఎంసి ల నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానికి తోడు ప్రాజెక్టులో ప్రతిపాదించిన కోయిలకొండ (76 టిఎంసి లు), గండీడు (35 టిఎంసి లు), కేపి లక్ష్మీ దేవిపల్లి (10 టిఎంసి లు) మూడు జలాశయాల్లో మొత్తం 47 గ్రామాలు, 85 వేల మంది జనాభా, 16,340 ఆవాసాలు ముంపు బారిన పడనున్నాయి. ఈ భారీ ముంపును తగ్గించాలని కూడా ప్రభుత్వం భావించింది. ఈ రెండు కారణాల రీత్యా ప్రభుత్వం ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసింది. రీ డిజైన్‌ చేసిన తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానమైన మార్పు – నీటి సోర్స్‌ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మారడం. పాత జలాశయాల స్థానే కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, పంపింగ్‌ సామర్థ్యాన్ని రోజుకు 1.5 టిఎంసిల నుంచి 2 టిఎంసిలకు పెంచడం, ఆయకట్టును 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం, గతంలో కంటే ముంపును గణనీయంగా తగ్గించడం జరిగింది.

ప్రభుత్వం జి.ఓ నంబరు 105 తేదీ 10.06.2016 ద్వారా ప్రాజెక్టుకు రూ. 35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు 11.06.2015 తేదీన కరివెన గ్రామం వద్ద శంకు స్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పనులని 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చెయ్యడం జరిగింది. పనులు ప్రారంభమయినాయి. ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌ పాలకులు, మరొక వైపు జిల్లా నాయకులే ప్రాజెక్టుపై కక్ష గట్టి ప్రాజెక్టును అడ్డుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు అనుమతి లేదని, అపెక్స్‌ కమిటీ అనుమతి గాని లేదని, ప్రాజెక్టుని వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ప్రాజెక్టుకు జి.ఓ 72 జారీ చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంమే సర్వే, సమగ్ర నివేదిక తయారీకి పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం అనుమతించిన ప్రాజెక్టులని కొనసాగించవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ జి.ఓ 72 ని అమలు చేస్తున్నదే తప్ప కొత్త ప్రాజెక్టు కాదు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని చేపట్టడానికి కె ఆర్‌ ఎం బి అనుమతి గాని, అపెక్స్‌ కమిటీ అనుమతిగాని అక్కర లేదు. అదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇక మరోవైపు జిల్లా నాయకుడైన నాగం జనార్ధన్‌ రెడ్డి ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరిగినాయన్న ఆరోపణతో ప్రాజెక్టు పనులని ఆపివేయించడానికి హైకోర్ట్‌ని ఆశ్రయించినాడు. అయితే హైకోర్ట్‌ ఆయన ఆరోపణల్లో బలం లేదని పిటిషన్‌ ని డిస్మిస్‌ చేయడం విశేషం. ఆన్ని అడ్డంకులని అధిగమించి ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అటవీ అనుమతితో మరో కీలకమైన ముందడుగు పడింది. మరో మూడెండ్లలో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారం కాబోతున్నది.
tsmagazine
పట్టికను గమనించినప్పుడు రీ డిజైన్‌ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గణనీయంగా తగ్గిపోయిందని అర్థమవుతున్నది.

Other Updates