రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. అడవులు నరికి, కలప స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయన్నారు. అడవులను రక్షించే విషయంలో చిత్తశుద్ధి, దఢచిత్తం, అంకితభావం కలిగిన అటవీశాఖ అధికారులను అటవీ ప్రాంతాల్లో నియమించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్, అటవీశాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
”రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి బహుముఖ వ్యూహం రూపొందించి, అమలు చేయాలి. ముఖ్యంగా నాలుగు విధాల చర్యలు తీసుకోవాలి. ఒకటి ప్రస్తుతమున్న అడవిని పూర్తిస్థాయిలో రక్షించాలి. రెండు అటవీ భూమిలో కోల్పోయిన పచ్చదనాన్ని(చెట్లను) పునరుద్ధరించాలి. మూడు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలి. నాలుగు హైదరాబాద్, వరంగల్ లాంటి మహా నగరాలతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనం పెంచాలి” అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
”జంగిల్ బచావో, జంగిల్ బడావో (ఉన్న అడవిని కాపాడాలి, పోయిన అడవిని పునరుద్ధరించాలి) అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. ఓ వైపు చెట్లు పెంచడం కోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించి పోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదు. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. అడవిని కాపాడే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలి. అటవీశాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారు. అడవులను నరికే వారిని, స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ ఉంది. వారిని గుర్తించగానే చర్యలు ప్రారంభం కావాలి. స్మగ్లింగ్ జీరో సైజుకు రావాలి. స్మగ్లింగుకు పాల్పడే వారిపై పి.డి.యాక్టు నమోదు చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. ఆ జిల్లాల్లోనే స్మగ్లింగ్ కూడా జరుగుతున్నది. అడవులు ఎక్కువగా నరికివేతకు గురవు తున్న ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి అడవిలో ఒక్క చెట్టు కూడా పోకుండా జాగ్రత్త పడాలి. కఠినంగా వ్యవహరిం చాలి. అడవులను రక్షించే విషయంలో చిత్తశుద్ధి, దఢచిత్తం, అంకితభావం కలిగిన అధికారులను ఆయా ప్రాంతాల్లో నియమించాలి. వారికి సాయుధ పోలీసుల భద్రత కూడా అందిస్తాం. పోలీసులు, అటవీశాఖ అధికారు ల సంయుక్త నిర్వహణంలో అడవికి వెళ్లే అన్ని మార్గాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా సాయుధ పోలీసుల పహారా పెట్టాలి. మొత్తంగా అడవిలో ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురికాకుండా, అంగుళం కూడా ఆక్రమణకు లోను కాకుండా కఠినంగా వ్యవహరించాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రజలే ముఖ్యం
”మాకు ప్రజలే ముఖ్యం. వారి భవిష్యత్తే లక్ష్యం. అంతకు మించిన ప్రాధాన్యం మరోటి లేదు. రాజకీయ ప్రయోజనం లేదు. భావి తరాలు బాగుండాలనే అడవుల రక్షణ, పచ్చదనం పెంచడం కార్యక్రమాన్ని ప్రాధాన్య తాంశంగా తీసుకున్నాం. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం. కలప స్మగ్లింగుకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే చర్య తీసుకోవాలి అని సిఎం చెప్పారు.
”భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. కాని తెలంగాణలో 24 శాతం మాత్రమే అటవీభూమి ఉందని అధికారిక లెక్కల్లో ఉంది. కానీ రాష్ట్ర భూభాగంలో 12 శాతం కూడా పచ్చదనం లేదు. అటవీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది. సమైక్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవుల నరికివేత జరిగింది. లక్షల ఎకరాల్లో అడవి పోతున్నా ప్రేక్షకపాత్ర వహించారు. అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మేల్కొనాలి. పర్యావరణం సమతుల్యంగా లేకుంటే మానవ మనుగడ లేదు. అటవీభూభాగంలో పోయిన పచ్చదనాన్ని తిరిగి సంపాదించాలి. పెద్ద ఎత్తున అటవీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి. అటవీభూభాగమంతా పచ్చని చెట్లతో నిండి ఉండాలి. అటవీభూములపై సాగు హక్కులు కలిగిన వారితో కూడా ఉభయ తారకంగా ఉండే చెట్ల పెంపకం చేయించాలి. అటు వారికి ఆదాయం రావాలి. ఇటు అడవి పెరగాలి. అలాంటి చెట్లను ఎంపిక చేయాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
”తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలి. ఖాళీ ప్రదేశాలన్నింటిలో చెట్లు పెంచాలి. ప్రతీ ఇంట్లో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. గ్రామాల్లో చెట్ల పెంపకాన్ని విధిగా చేపట్టడం కోసం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తెచ్చాం. ప్రతీ గ్రామంలో ఖచ్చితంగా నర్సరీలు ఏర్పాటు చేయాలి. విరివిగా మొక్కలు నాటి, వాటిని రక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు స్వీకరించాలి” అని ముఖ్యమంత్రి కోరారు.
నగరాలు జాగ్రత్త
”నగరాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం వల్ల రోగాలొస్తున్నాయి. మిగతా నగరాల పరిస్థితి కూడా అలాగే ఉంది. హైదరాబాద్ లో ఉండడం ఇప్పటి వరకు మన అదష్టమని భావిస్తున్నాం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే అదీ దురదష్టంగా మారుతుంది. పట్టణ ప్రాంతాల్లో పెరిగే వాహనాలు, జనాల వల్ల కాలుష్యం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా పచ్చదనం పెంచకుంటే భావి తరాలకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగరాలతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో విరివిగా చెట్లు పెంచాలి. ఆయా నగర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకులను గుర్తించాలి. వాటిని పార్కులుగా మార్చాలి. వాటిలో వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయాలి. వాకర్స్ క్లబ్బులు ఏర్పాటు చేసి, ఆయా ఫారెస్టు బ్లాకుల సంరక్షణ బాధ్యలను వారికే అప్పగించాలి. నగరాలు, పట్టణాల్లో చెట్ల పెంపకానికి ప్రత్యేక వ్యూహం రూపొందించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీచట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవులను రక్షించడం, స్మగ్లర్లను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నార. ఈ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ రక్షణ కోసం కొత్త చట్టం రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధులను వినియోగించుకోవడంతో పాటు, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, అవసరమైతే గ్రీన్ సెస్ వసూలు చేస్తామని, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజా ప్రతినిధుల నుంచి నెలకు కొంత మొత్తంలో విరాళం రూపంలో స్వీకరిస్తామని, సి.ఎస్.ఆర్. నిధులను కూడా ఈ కార్యక్రమం కోసమే వినియోగిస్తామని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో నిధుల కొరత రాకుండా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు