పున్న అంజయ్య
తెలంగాణ విముక్తి ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నిజాం నవాబు క్రూర పరిపాలనకు బలైపోతున్న సమయంలో కవులు కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోలేదు. కవి సింహంలా గర్జించారు. వారిలో దాశరథి, కాళోజిల తర్వాత చెప్పుకోదగిన కవి సింహం ధవళా శ్రీనివాసరావు.

నల్లగొండజిల్లా చండూరుకు దగ్గరలో వున్న కస్తాల గ్రామంలో 1918లో లక్ష్మీనరసమ్మ, కీసర నరసింహారావు దంపతులకు జన్మించి తన పన్నెండవ ఏట ధవళా కిషన్‌ రావు, మహాలక్ష్మమ్మ దంపతులకు దత్తుపోయి కోటయ్య గూడెంలో స్థిరపడినారు. 1934లో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి చండూరులో స్థాపించిన ‘సాహితీ మేఖల’ సంస్థ సభ్యులలో ఒకరు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శి కూడాను.

భావ కవిత్వం స్వేచ్ఛగా విహరిస్తున్న కాలంలో ఈ కవి తన గళం విప్పి కవితాగానం చేశారు. ఈ కవికి పల్లెటూళ్ళన్నా, పచ్చని పంటపొలాలన్నా ఎంతో ఇష్టం కాబోలు. అందుకే చేలన్నీ పచ్చదనంతో కళకళలాడుతూ వుండాలని, మండుటెండలకు ఎండి, వాడిపోయే పొలాలు చూచి తన కన్నీళ్ళతోనైనా వానికి తేమ గూర్చాలని ”మధు – రోహ”లో కోరుతాడు.

నా కలం

నేడు

బలరాముని హలం ‘అంటాడొకచోట

నేనెవరో

నన్నెరుగరు

కవిని – కాదు

గాయకుడను

శిల్పినంటారేమొ –

అదిగాదిదిగాదు, నేను

మధురోహను

మధురోహను’ అని అంటారు మరోచోట.
tsmagazine

ఈ కవికి తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద ఎంతో ప్రేమ, గౌరవం. అందుకే తెలుగు భాష పట్ల చిన్న చూపుగల వారిని మందలిస్తూ…

తెలుగు దేశాన జన్మించి తెలుగు చేత

మంచి చెడ్డల భేదంపు మర్మమరసి

తెలుగు పొలముల పంటను తినుచు బెరిగి

తెలుగు బాసన్న నాలుక తేలవైతె? అని చురకలంటించాడు.

నిజాం పాలనలో ఉర్దూ భాషా సాహిత్యాలను, అక్కడి ఫాయర్లనూ, ముషాయర్లను మెచ్చుకునే సందర్భంలో తెలుగు రాదని యేప్పుకోవడమే గొప్పగా భావించే వారు. ఇది నచ్చని ధవళా శ్రీనివాసరావు కవి సింహంలా గర్జించాడు.

తెలుగన్నంతనే యేవగించుకొని

మూతిన్‌ విప్పవేమోయి ఈ

తెలుగుంబాస పసందు ముచ్చటలు

సుంతేనిం పసందింపవో

పలుకం జెల్లునె తెల్గురాదనుచు

నీ పాండిత్య మా గంగలో

గలుపంగా దగదే యదేది

యయినంగానిమ్ము నీ పాలిటన్‌

పరభాషా వ్యామోహంలో పడి మాతృభాషను విస్మరిస్తున్న వారినుద్దేశించి ఇలా అంటారు.

ఇక నెన్నాళులు నిద్ర జెందెదవు నీ విట్లే ప్రమత్తుండవై యకళంకబగు మాతృభాషను సమర్చల్‌ సేయగా నేడెనీ సకలంబున్‌ త్యజియింపు మీ పరుల బాసల్‌ నేర్చి నీ యాత్రనే

యకటా విస్మృతి పాలు సేయ వలదన్నా! సిగ్గు చేటొగదా!

పాటలాగా పద్యాన్ని పరుగెత్తించే కలం – బలం తెలంగాణ కవులే ఎక్కువగా ప్రదర్శించారనడానికి ఈ కవే నిదర్శనం.

భావ కవిత్వ ప్రభావంతో భవ్యమైన కవిత్వం రాసిన ధవళశ్రీలో అభ్యుదయ కవిత్వ ధోరణులు కూడా మనకు కన్పిస్తాయి. ఇందుకు ఉదాహరణగా ‘రైతు’ ఖండికలో

అదిగో! నీ సతి కట్టుగుడ్డ కరువౌటం జేసి యాపేలికల్‌

గుదురంగా జతగూర్చి కట్టుకొనె నీకున్‌ జేనెడంతైన మేన ధరింపన్‌వలిపంబు లేదెటుల నన్నా! పొట్టకున్‌ బట్టకున్‌

మొదలుంగా నటువంటి నీ బ్రతుకు ముప్పుల్‌ వాపుకో – జాలుటల్‌’ అని చెప్పారు.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన దాశరథి తొలి రచన ‘అగ్నిధార’ను సాహితీ మేఖల ప్రచురించింది. అందుకే అంబటిపూడి వీరినుద్దేశించి దాశరథి అగ్నిధార ఐతే ధవళశ్రీ అమృతధార అని అంటారు. అది నిజమే అయ్యింది కూడా. ధవళశ్రీ కవి మాత్రమే కాదు. గొప్ప దేశభక్తుడు కూడా. 1946లో దేశమంతటా చెలరేగిన మతకలహాలను, కరువుకాటకాలను దృష్టిలో ఉంచుకొని ఈ కవి పడిన ఆవేదన ‘ఏమి వ్రాయాలె? నేనేమి వ్రాయాలె?’ అన్న గేయం వెలువడ్డానికి మూలమయింది. ఇది దేవులపల్లి రామానుజ రావు ‘శోభ’ పత్రికలో అచ్చయింది.

ఏమి వ్రాయాలె?/ నేనేమి వ్రాయాలె?

నా ఇంటి నడుమనే/ పెనుమంటలే రేగ

నా తమ్ములే విలయ/ నాట్యాలు సేయగా

నా కూనలీనాడు/ బాకులకు బలిగాగ

నాదు చెల్లెండ్ర/ మర్యాద దోపిడిసాగ

నా తల్లి గుండియలు/ కోతల్లు పడ్డాక

నా నేల కరువులకు/ తావలంబైనాక

నా సభ్య సంస్కృతులె/ నరుకుళ్ళు బడ్డాక

నా నాయకుల రక్త/ నాళాలు తెగినాక…

ఏమి వ్రాయాలె?

ధవళశ్రీ పద్యం రాసినా గేయం రాసినా పాఠకుల మనస్సులోకి చొచ్చుకొని పోయే విధంగా రాస్తారు. జాతీయోద్యమ స్ఫూర్తితో బలమైన కవిత్వాన్ని అందించారు. ఈ కవి తమ గురువులైన అంబటిపూడి వద్ద ఆంగ్ల సాహిత్యాన్ని నేర్చుకొని గోల్డ్‌స్మిత్‌, వర్డ్స్‌ వర్త్‌, కీట్స్‌, షెల్లీ మొదలైన ఆంగ్ల కవుల కావ్యాలను చదివి ఉత్తమ రచనకు,

ఉపన్యాసానికి కావలసిన భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తులనాత్మక పరిశీలనలో ఆసక్తిని కనబరిచిన ధవళశ్రీ అటు ప్రాచీన పద్ధతిలో ఛందో బద్ద కవితలను, ఇటు నవీన ఫక్కీలో మాత్రాఛందస్సులో గేయాలను సమానంగా రాశారు.

గోలకొండ పత్రికలో తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించిన ధవళశ్రీ ఆనాటి పత్రికల్లో తన కథల్ని వెలువరించినాడు. కానీ ఆ కథలు నేటికీ వెలుగులోకి రాలేదు ‘నేను ఏడ్పు మానలేదు’ ఆయన రాసిన కథల్లో ఒకటి.

ఈ కవి మరణానంతరం వీరి కుమారులు అముద్రితంగా వున్న కవితలు, పద్యాలన్నీ సేకరించి ”ధవళశ్రీ” పేరుతో 1991లో అచ్చువేయించారు. ఈ కవి 1980 మే 7న కన్నుమూశారు.

Other Updates