tsmagazineరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భక్తి ప్రపత్తులతో నిర్వహించిన మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం అంగరంగ వైభవంగా జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ప్రజల క్షేమం, అభివద్ధి, లోక కళ్యాణం కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25 వరకు ఈ యాగం నిర్వహించారు.

కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

సహస్ర చండీయాగం: కలియుగంలో అతి శ్రీఘ్రంగా ఫలాలను ఇచ్చే దేవుళ్లు వినాయకుడు, చండీ అని శాస్త్రాలు పేర్కొన్నాయి. రాష్ట్రం ప్రగతి పథాన మరింత ముందుకు వెళ్లాలని, చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా త్వరితగతిన పూర్తయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతోపాటు కేంద్రం, ఇతర రాష్ట్రాలతో స్నేహపూరిత వాతావరణం, లోకకళ్యాణాన్ని ఆశిస్తూ ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీ శంగేరి జగద్గురువులు, విశాఖ పీఠాధిపతుల ఆశీస్సులతో ఈ యాగాన్ని నిర్వహించారు.
tsmagazine

సహస్ర చండీయాగంలో భాగంగా మొదటిరోజు గణపతిపూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, అగ్నిమథనం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శంగేరి సంస్థాన పద్ధతిలో ఏకోత్తరవద్ధి విధానంలో సహస్ర చండీయాగాన్ని నిర్వహించారు. మొదటిరోజు 100 పారాయణాలు, నాలుగు లక్షల నవార్ణవ జపం, రెండోరోజు 200 పారాయణాలు, మూడు లక్షల జపం, మూడోరోజు 300 పారాయణాలు, రెండు లక్షల జపం, నాల్గోరోజు 400 పారాయణాలు లక్ష జపం చేశారు. చివరిరోజు తత్‌ తర్పణాలను నిర్వహించి వెయ్యికిలోల పాయసద్రవ్యంతో 10 హోమగుండాలలో చండీయాగాన్ని నిర్వహించారు.

పాయసద్రవ్యం:

చండీ సప్తశతిలోని 13 అధ్యాయాలకు సాధారణంగా ఆయా అధ్యాయం చివర్లో పేర్కొన్న ఆయా పండ్లు, ద్రవ్యాలతో హోమం చేస్తారు. కానీ ఇక్కడ ఆయా పదార్థాలతోపాటు విశేషంగా శాస్త్రాలలో పేర్కొన్న పాయసద్రవ్యాన్ని, ఆజ్యక్తతిలలను వినియోగించారు. ఈ పాయసాన్ని బియ్యం, పాలు, తేనె, సుగంధద్రవ్యాలతో ప్రత్యేకంగా తయారుచేశారు. సహస్రచండీ యాగంతోపాటు మరింత విశేషంగా ఉండాలన్న పండితుల సూచనల మేరకు మహారుద్ర, బగళా, రాజశ్యామల, నవగ్రహ, సూర్యారాధనలను నిర్వహించారు.
tsmagazine

మహారుద్రయాగం: ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో ప్రతిరోజు 44 మంది రుత్వికులతో రుద్రపారాయణం, 44 మందితో ఏకాదశ రుద్రహవనాన్ని నిర్వహించారు. వీటికోసం ఆజ్యక్త తిలలను హోమద్రవ్యంగా వినియోగించారు. చివరిరోజున పూర్ణాహుతిని సీఎం దంపతులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

శ్రీపీతాంబరి బగళాదేవి:

సహస్రచండీలో భాగంగా సర్వం పీతాంబరమైన ప్రత్యేక యాగశాలలో బగళాదేవి విశేషపూజా, జప, హవనాలను నిర్వహించారు. దశ మహావిద్యలలో అష్టమ విద్యగా ప్రసిద్ధిగాంచిన బగళా దేవి యాగాన్ని పంచదశీ ఉపాసకులతో నిర్వహించారు. 21 మంది రుత్వికులు ప్రతిరోజు 20 వేల జపం, మూలమంత్రంతో రెండువేల హవనాన్ని నిర్వహించారు. మొత్తం ఐదురోజుల్లో లక్ష జపం, పదివేల హవనాన్ని నిర్వహించారు. ఈ యాగశాల మొత్తం పీతాంబర అంటే పసుపు రంగులో మెరిసిపోయింది. కుంకుమార్చనలో కుంకు మ బదులు పసుపును వినియోగించడం పీతాంబరీ దేవి ప్రత్యేకం. స్తంభన దేవతగా, బ్రహ్మాస్త్ర విద్యారూపిణిగా ఈ అమ్మవారిని కీర్తిస్తుంటారు. ఈమెను ఆరాధించడం వల్ల శత్రుపీడ, పనుల్లో ఆటంకాలు, విపత్తుల స్తంభన జరిగి లోకకళ్యాణం జరుగుతుంది. తెలుగుప్రాంతంలో బగళాదేవిని ఇంత విశేషంగా ఆరాధించడం ఈ శతాబ్దకాలంలో ఇదే మొదటిసారి అని పండితులు పేర్కొన్నారు.
tsmagazine

రాజశ్యామలయాగం:

దశమహా విద్యల్లో తొమ్మిదోవిద్యగా పేర్కొన్న రాజశ్యామలా అమ్మవారి యాగాన్ని నిర్వహించారు. లోకకళ్యాణం, ప్రజలు సర్వసంపదలతో సుబిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ఐదురోజులపాటు జపాలు, హవనాలు నిర్వహించి చివరిరోజున పూర్ణాహుతితో రాజశ్యామాల యాగాన్ని శ్రీ విశాఖపీఠం ఆధ్వర్యంలో నిర్వహించారు.

చండీయాగాన్ని మరింత సుసంపన్నం చేయడానికి చండీ మంటపానికి నాలుగు వైపులా అంటే తూర్పున రుగ్వేద, దక్షిణాన యజుర్వేద, పశ్చిమాన సామవేద, ఉత్తరాన అథర్వణవేద యాగశాలలు ఏర్పాటుచేశారు. వీటిలో ప్రతిరోజు ఆయా వేదాల పారాయణం, హవనాన్ని వేదపండితులు నిర్వహించారు. వీటితోపాటు మహాసౌరం, నవగ్రహ, మహా మత్యుంజయ జపాలు, హవనాలను నిర్వహించారు. ఈ వైదిక కార్యక్రమాలు చతుర్వేద పండితులు మాణిక్య సోమయాజులు పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ తంగిరాల సీతారామ శర్మ, పురాణం మహేశ్వరశర్మ, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ, శాస్త్రుల వేంకటేశ్వరశర్మ, గంగవరపు నారాయణశర్మ, కాసుల చంద్రశేఖర శర్మ, కామేశ్వరశర్మ, తోపాటు సుమారు 300కు పైగా రుత్వికులు ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
tsmagazine

ప్రతిరోజు వేలాదిమంది భక్తులు ఈ యాగశాలలకు వచ్చి ఆయా కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వీరందరికీ నిత్యం అన్న ప్రసాదవితరణను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. అదేవిధంగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు, విధానసభ ఛైర్మన్‌, హోం మంత్రి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు వీఐపీలు కార్యక్రమాలకు హాజరైనారు. సనాతన సంప్రదాయంగా ప్రతి ఒక్కరు ధోతి, చీరెలను కట్టుకుని కార్యక్రమాలకు మరింత శోభని తెచ్చారు. సామాన్యుల నుంచి వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ యాగం ఐదురోజులపాటు భక్తి, శక్తి, విధి అనే కర్మత్రయంతో సీఎం దంపతులు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం తను నమ్మిన ధర్మం ప్రకారం భక్తి, శ్రద్ధలతో ఆచరించి సమస్త ప్రపంచానికి సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారని ఆధ్యాత్మికవాదులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద చికాగో సభలో చెప్పినట్లు స్వధర్మ ఆచరణ చేస్తూ పరధర్మాలను సమానంగా గౌరవిస్తూ అన్నింటిలోని గొప్పని స్వీకరిస్తూ రాజ్యపాలన చేయడం నిజంగా ముదావహం.
tsmagazine
యాగ ద్యుతి

1. జ్వాలామాలికలన్న నాలుకలతో జాజ్వల్యమానమ్ముగా

వాలాయమ్ము హవిస్సులన్‌ గొనుచు భాస్వన్మూర్తి యజ్ఞేశుడున్‌

మేలుం బంగరు రంగు లుల్లసిల సంప్రీతిన్‌ తెలంగాణలో

శ్రీలన్‌ గూర్చగ సిద్ధమయ్యె మన కేసీఆర్‌ మనస్సమ్మతిన్‌

2. నమకమ్మున్‌ చమకమ్ము మంగళ మహాన్యాసమ్ముతో భాసయు

క్తముగా, సప్తశతీ మహా మను సమేతమ్మై, మహా ఋత్విజా

తి మనోజ్ఞమ్మయి ఎర్రవల్లియె మణి ద్వీపమ్ముగా శోభిలెన్‌

రమణీయమ్ముగ, పాడిపంటల తెలంగాణమ్ము వర్ధిల్లగన్‌

3. అదిగో హోమసుధూమమంజరి శుభవ్యాసంగమై, సంస్కృతి

ప్రదమై నిండుచు నెర్రవల్లిపురి శోభాస్వామి శ్రీ కేసీఆర్‌

వదనమ్మందున కస్తురీ తిలకమై భాసించి భద్రమ్ముగా

ముదమై బాలతమాల కోరకముగా భూషించె శీర్షమ్మునన్‌

– డా|| జి. యం. రామశర్మ,శతావధాని

Other Updates