టి. ఉడయవర్లు
tsmagazine
”క్లిక్‌” అనిపించగానే కేవలం ”కటకం” ఉంటే చాలదని, భావుకుడి ”కన్ను” ఉన్నప్పుడే కళాఖండాలు తీయడం సాధ్యమని నిరూపించినవాడు రాజన్‌ బాబు. కాంతి లక్షణాన్ని తెలుసుకున్న పరిణతితో తీసిన చిత్రాలను రసాయనాలతో కడిగినప్పుడు కావలసిన అంశం కనుమరుగు కాకుండా చూసే పనితనం ఆయన స్వంతం. అందుకే ఆయన తీసిన ఫోటోలన్నీ తీపిగురుతులయ్యాయి. ఆయన తీసిన ఫోటోలు – కేవలం దృశ్యాలు, వ్యక్తులు కాదు. వాటి వెనకాల కథలను కనులకు కట్టే కమనీయకావ్యాలు. ఒక వస్తువును తీసుకున్నప్పుడు ఆయన పొందిన అనుభూతిని అంతర్నేత్రంతో చూసి రసాయనాలతో పాటు రంగరించి, పనితనంతో సాధించిన కృషీవలుడాయన.
tsmagazine

కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో 1939 ఫిబ్రవరి 9వ తేదీన కన్నుతెరచిన రాజన్‌ బాబుకు చిన్ననాటి నుంచీ చిత్రకళపట్ల ఆసక్తి ఎక్కువ. అయితే ఆయన సోదరుడొకరు బహూకరించిన చిన్న కెమెరాతో కంటికి కనిపించిన వాటినన్నింటినీ ఫోటోలు తీయడం ప్రారంభించాడు. తన ప్రవృత్తినే వృత్తిగా చేసుకోవాలనే కాంక్షతో హైదరాబాద్‌ చేరి జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలిత కళల కళాశాలలో డిప్లొమా కోర్సులో చేరాడు. ఆ క్రమంలో ఆయన చదివిన అప్లైడ్‌ ఆర్ట్స్‌లో ఫోటోగ్రఫీ భాగం కావడంతో ”భలే” అనుకున్నాడు. ”భళీ” అనిపించుకున్నాడు. ఆ తరుణంలోనే పేరెన్నికగన్న రాజాత్రయంబక్‌ బహదూర్‌ దృష్టి ఆయనపై పడడం, ఆయన శిష్యరికంలో ఒక గొప్ప ఛాయాచిత్రకారుడుగా రాజన్‌ బాబు రూపుదిద్దుకోవడం మొగ్గ పూవైన రీతిలో తిరిగి పోయింది.tsmagazine

అయితే దీనివెనక ఆయన అంకితభావం, ఏకాగ్రత, క్రమశిక్షణ, విషయ గ్రహణ శక్తి ఉన్నందునే ఆయన తీసిన ఛాయాచిత్రాలన్నింటిలో రాజన్‌ బాబు ముద్ర ప్రస్ఫుటమవుతున్నది. ఆయన తీసిన అనేక తరహా ఛాయా చిత్రాల్లో పిక్టోరియల్‌ అధ్యయనం గొప్పదని కొందరంటే, అరకు తదితర గిరిజన తెగల జీవన శైలిని ప్రతిబింబించిన ఛాయా చిత్రాలు మరికొందరు అంటారు. అశ్లీలం లేకుండా స్త్రీ సౌందర్యాన్ని నగ్నత్వాన్ని తీసిన ఛాయాచిత్రాలు అపురూపమైనవని, ప్రకృతికి దర్పణం పట్టిన చిత్రాలు మరీ పసందైనవని కళా హృదయులు అంటారు. అంతేకాదు ”ఫ్యాషన్‌” చిత్రాలు తీసినా, పారిశ్రామిక సంబంధమైన ఛాయా చిత్రాలు తీసినా అవి ఆయన సౌందర్య దృష్టికి, పని తనానికి మచ్చుతునకలుగా పలువురు ఫోటో గ్రాఫర్లు ప్రశంసిస్తారు.

వీరి ఛాయాచిత్ర ప్రదర్శనలు హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. బెల్జియం, చెకొస్లోవేకియా, టోరంటో, అమెరికా చైనా దేశాల్లో అక్కడి కళా విద్యా సంస్థలు ఏర్పాటుచేసి, ఛాయా చిత్ర అభిమానులకు, విద్యార్థులకు కనుల విందు చేశారు.

తాను చదువుకున్న లలిత కళల కళాశాలలోనే ఫోటోగ్రఫీ విభాగంలో అధ్యాపకుడై ఎందరో యువ ఫోటోగ్రాఫర్లను తయారు చేశాడు. రాష్ట్రంలోని పలు పట్ణణాల్లో ఫోటో సర్కిల్స్‌ ఏర్పాటు చేసి ఎందరో యువకులకు ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్పారు. తాను నిష్టతో ఫోటోలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, గౌరవాలు పొందిన నిరంతర ఛాయా చిత్రకారుడే కాకుండా అరుదైన గురువు ఆయన.
tsmagazine

ఆయన 1983లో ఇంగ్లాండ్‌ – రాయల్‌ ఫోటోగ్రఫీ సొసైటీ నుంచి పొందిన అసోసియేట్‌ ఆఫ్‌ ది రియల్‌ ఫోటోగ్రఫీ సొసైటీ (ఎ.ఆర్‌.పి.ఎస్‌.) 1987లో పొందిన ఇంగ్లాండ్‌కే చెందిన ఫెల్లోషిప్‌ ఆఫ్‌ ది రాయల్‌ ఫోటోగ్రఫీక్‌ సొసైటీ (ఎఫ్‌.ఆర్‌.పి.ఎస్‌.) గుర్తింపులు – గౌరవాలు చెప్పుకోదగినవి. ఆయన ఇంకా ఆవార్డులు సన్మానాలు పొందాడు.

ఫోటోగ్రఫీలో అశ్లీలత లేని నగ్నత్వంపై ఆయన పరిశోధననే రాయల్‌ సొసైటీ గౌరవించింది. ఈ గౌరవం వ్యక్తిగతంగా ఒక ఛాయాచిత్రకారుడికి దక్కడం ఛాయాచిత్ర ప్రపంచంలోనే అరుదు. స్త్రీ నగ్నత్వం తీయాలంటే తొలుత ఛాయాచిత్రకారుడికి ఉండవలసింది కళాత్మక దృష్టి. ఈ ప్రక్రియలో సాధారణంగా చాలామంది కృతార్థులు కాలేరు. కాని శిక్షణతో కూడిన కార్యశీలత, రూపం గురించిన అవగాహన, సరైన కోణం, వెలుగు – నీడల తూగు తెలిసినవాడు కాబట్టి స్త్రీ సౌందర్యాన్ని ఒక భావుకతతో, సృజనాత్మకశక్తితో ఆయన తీశాడు.tsmagazine

అట్లాగే ప్రకృతి చిత్రాలు తీయడంలోను విశేష దృష్టి, వాస్తవికత, స్వచ్ఛత, స్పష్టత, చతురత – వీటన్నింటిని మించిన కళాత్మకతకు ఆయన పెద్దపీట వేశాడు.

కొన్నాళ్ళు, అరకును, ఆదిలాబాద్‌ అడవులను కార్యక్షేత్రం చేసుకుని ”అడవిపూలు” శీర్షికన తీసిన గిరిజనుల జీవన శైలి చిత్రాలు దృశ్య కవితలాంటివి. అందులో వారి జీవితానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు ఆయన దర్పణం పట్టిన తీరు అనితరసాధ్యమైంది. ఆసక్తిదాయకమైంది. ఈ ఛాయాచిత్రాలతో రాజన్‌బాబు దేశదేశాల్లో హైదరాబాద్‌ పతాకం రెపరెపలాడించాడు.
tsmagazine
గాఢమైన అనుభూతితో, శిక్షణాయుతంగా అమర్చిన ఎక్స్‌పోజర్‌, సరైన కోణం, చక్కని కూర్పుతో, కాంతితో మాత్రమే కాకుండా గీతలు పడ్డ చెత్త నెగిటివ్‌ నుంచి పురస్కారాలందుకునే కళాఖండాలు సృష్టించిన ఖ్యాతి రాజన్‌ బాబుది. రోజులు, వారాలు నెలలు కష్టపడి తీసిన తెలుపు – నలుపు కళాఖండాలనదిగిన ఛాయా చిత్రాలను, పరహస్తం చేసి చూస్తుండగా రంగులలో లేదా ఫోటోషాపుల హంగులతో ఛాయా చిత్రాలు వేసిచ్చే సౌకర్యం వచ్చేసింది. దీన్ని మించి ఇలా క్లిక్‌ మనిపించగానే కెమెరాలోనే రంగుల విందుతో తిలకించగలిగిన డిజిటల్‌ ఫోటోగ్రఫీ అందుబాటు లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ”స్కోప్‌ షాడో”కు ఫోటోకు మధ్య తేడా తెలిసిన రసికుడెవరైనా – అందరు ఫోటో గ్రాఫర్లకు ఛాయా చిత్రాలకు రాజన్‌ బాబు తీసిన ఛాయాచిత్రాలకు మధ్య గీతను ఇట్టే పసిగడతాడు. ఇంతటి అపురూప ఛాయా చిత్రకారుడు రాజన్‌బాబు 2011 ఆగస్టు 24వ తేదీన తన 73వ యేట కన్నుమూశారు.

Other Updates