tsmagazineమంజుల చకిలం
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన లక్ష్మీనరసింహస్వామి యాదరుషి చేసిన తపస్సు ఫలితంగా ఇక్కడ యాదాద్రి కొండపై స్వయంభువుగా వెలిసి భక్తులను కటాక్షిస్తున్నాడు. త్వరలో భక్తుల కోరిక మేరకు నిజ ఆలయంలో స్వయంభువుల నిజదర్శనం కలిగే శుభ సమయం ఆసన్నమైంది. రాజుల కాలంనాటి కళావైభవం కనపడే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

తంజావూరు తర్వాత దేశంలోనే అతిపెద్ద రాతి కట్టడంతో నిర్మించిన పుణ్యక్షేత్రంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయం చరిత్రపుట్లలోకి చేరనుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్ప బలంతో దేవాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80శాతం పనులు పుర్తయ్యాయి. రెండువేల కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమౌతున్న యాదాద్రి నర్సన్న ఆలయం రెండు మూడు నెలల్లో పూర్తి కానుంది. అన్ని కలిసివస్తే మార్చిలో నిర్వహించే ఆలయ బ్రహ్మూెత్సవాలు నూతన దేవాలయంలో జరుగనున్నాయి. మహారాజప్రసాదం, ఆలయానికి నలుమూలల ఐదుతలల రాజగోపురాలు, ఈశాన్యదిశగా త్రితల రాజగోపురం, గర్భాలయంపై పంచతల రాజగోపురం, పడమటిదిశగా దేవాలయ ముఖద్వారం వద్ద సప్తతల మహారాజగోపురం ఇప్పటికే పూర్తి చేశారు. మహారాజగోపురానికి చుట్టూ నరసింహస్వామి అవతారాల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయ గోపురంపై బంగారు తాపడం పనులు చేపట్టాల్సి ఉంది.

ఒకప్పుడు అర ఎకరం స్థలంలో ఉన్న ఆలయం ఇప్పుడు 2ఎకరాల 33గుంటల స్థలంలో నిర్మాణం అవుతోంది. గుట్టలుగా ఉన్న ఉపరితలాన్ని మొత్తం సిమెంట్‌ కాంక్రీటుతో సమతలంగా చేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 2వేల మంది శిల్పులు, 8 మంది కాంట్రాక్టర్లు, 10 మంది ఉపస్థపతులు, ప్రధాన స్థపతి సౌందర్యరాజన్‌ ఈ మహాద్‌ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. ప్రకాశం జిల్లా గురిజేపల్లి నుండి సుమారు రెండున్నర లక్షల టన్నుల రాతిని ఆలయం నిర్మాణం కోసం తీసుకుని వచ్చారు. ఒకప్పుడు ఉలి, సుత్తిని ఉపయోగించి శిలలను చెక్కే వారు. దీనితో పదుల సంవత్సరాల పాటు శిల్పులు ఆ పనిలో నిమగ్నమయ్యేవారు. కాని ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. శిలలను చెక్కె మెషిన్లు వచ్చాయి. దీనితో యాదాద్రి నిర్మాణ పనులు ప్రారంభించిన రెండున్నర సంవత్సరాలలోనే ప్రధాన గర్భాలయ పనులు ఒక రూపుకు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన సందర్శకులను నిర్మాణాలు కట్టిపడేస్తున్నాయి. అద్భుతమైన శిల్పకళకు నెలవుగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. రెండువేల సంవత్సరాల తర్వాత ఇలాంటి దేవాలయం నిర్మాణం అవుతోంది అంటే అతిశయోక్తి కాదు.
tsmagazine

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు, ఆకట్టుకునే శిల్పకళాకతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. రాజుల కాలంనాటి నిర్మాణశైలిని అనుసరిస్తూ.. జీవకళ తొణికిసలాడేలా కష్ణ శిలలతో కూడిన అద్భుత సౌందర్య నిర్మాణం త్వరలో ఆవిష్కతం కానుంది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అతిపురాతనమైన యాదగిరికొండపై కొలువైన పంచనారసింహుడి ఆలయ మహిమలు విశ్వవ్యాప్తం కానున్నాయి. దక్షిణ భారతంలోని తంజావూరు, అనంత మంగళం, మధుర, రామేశ్వరం వంటి పురాతన ఆలయాల నిర్మాణ శైలిని మించిన రాతి శిల్పాలు ఇక్కడ సిద్ధమవుతున్నాయి. పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో సాగడం యాదాద్రి ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతున్నారు. రెండువేల సంవత్సరాల జీవం కలిగిన కష్ణశిలలను ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. సప్తగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపాలను కాకతీయుల కాలంనాటి శిలా సంపదను పోలేలా రాతి శిల్పాలను తీర్చిదిద్దారు. సింహం ముఖంగా ఉండే యాలీ పిల్లర్లు సిద్ధమయ్యాయి. వైష్ణవ ధర్మాన్ని చాటిచెప్పిన పన్నిద్దరు ఆళ్వారుల విగ్రహాలను ఏకశిలలపై చెక్కించారు. యాదరుషి, ప్రహ్లాదుల విగ్రహాలను ప్రధాన ఆలయ

ముఖమండపంలో ఏర్పాటు చేశారు. మొత్తం రెండు ప్రాకారాలుగా ఆలయం రూపు దిద్దుకుంటుంది. అంతర్‌ప్రాకారంలో గర్భాలయంతో పాటు ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శయన నారసింహస్వామి కోసం అద్దాలమండపం సిద్ధం చేస్తున్నారు.

దేవాలయంలో ప్రాకారమండపానికి సప్తగోపు సముదాయం శోభను తీసుకురానుంది. ఆలయానికి బయట అష్టభుజి మండప నిర్మాణం అందంగా తీర్చిదిద్దారు. అంతర్‌ ప్రాకారం పనులు జరుగుతున్నాయి. ఆలయ మండపాలకు ప్రాకార మండపాలకు త్వరలో రాతి ప్లోరింగ్‌ పనులు చేపట్టనున్నారు. బయట ప్రాకారం ఉత్తరదిశగా బ్రహ్మూెత్సవ మండప నిర్మాణం జరుగుతుంది. ఒక్కసారే 15వేల మంది భక్తులు కూర్చుని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేలా నిర్మిస్తున్నారు. ఆలయ కైంకర్యాలలో ప్రధానమైనవి రామానుజ కూటమి, యాగశాల, నిత్య కళ్యాణమండపం, అద్దాల మండపం, ప్రవచనశాల ఇంకా నిర్మించాల్సిఉంది. 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, విమానగోపురంపై నిర్మించే శంకుచక్రనామాలు, జయవిజయుల విగ్రహాలు, రక్షణగోడలపై నిర్మితమౌతున్న అతిపెద్ద ఏనుగు చిత్రాలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

పురాతన ఆలయాలలో గత స్మ తులను చూపించిన విధంగా వెయ్యి ఏళ్ళ వరకు కూడా యాదాద్రి ఆలయం దర్శించిన వారికి తెలంగాణ చరిత్ర, సంస్కతి, జీవన విధానం, సాంప్రదాయాలు, పండుగలు, క్రీడలు, మహారాజుల గొప్పతనాలు, వ్యవసాయ విధానాలు తెలిసే విధంగా అష్టభుజి ప్రాకారంలోని బాలపాద స్తంభాలపై చిత్రాలను చెక్కించారు. ఈశాన్యం వైపు ఉన్న స్తంభంపై ఐదు, ఇరవై, ఇరవై ఐదు పైసల, నాణాల చిత్రాలను, వాయువ్యం వైపు ఉన్న స్తంభంపై గ్రామీణ ఆటలైన చిర్రగోని. అష్టాచెమ్మ, క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ ఆడుతున్న బొమ్మలు, నైరుతి స్తంభంపై ఆధునిక వ్యవసాయం, ప్రాజెక్టులు, చేతి వత్తుల చిత్రాలు, ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం చిత్రాలను చెక్కించారు. ఆలయం లోపలికి నేరుగా సూర్యకిరణాలు ప్రసరించేలా సప్తగోపురాల మధ్య ప్రాంగణంలో అక్కడక్కడ అద్దాలను ఏర్పాటు చేశారు. ప్రాకారంలో ఉన్న 500 స్తంభాలకు నలువైపులా వివిధ భంగిమలలో నత్యరీతులను అందంగా చెక్కించారు.tsmagazine

అలనాటి రాజులు నిర్మించిన విధంగా చాలా కాలం తర్వాత మొత్తం దేవాలయ ఆపాదమస్తకం రాతి శిలలతో నిర్మిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి సారధ్యంలో స్తపతులు సౌందర్యరాజన్‌, అనందాచారి వేలు పర్యవేక్షణలో నిత్యం రెండువేల మంది శిల్పులు పనిచేస్తున్నారు. 11కోట్లతో విష్ణుపుష్కరిణిని ఆధునీకరిస్తున్నారు. పుష్కరిణి వెడల్పుతో పాటు చుట్టు మెట్లు, ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి కొండకు అనాదిగా గిరి ప్రదక్షిణకు ప్రాధాన్యం ఉండటంతో కొండ చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేసేవిధంగా 150మీటర్ల వెడల్పులో రింగు రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. శివకేశవులకు నిలయమైన యాదాద్రి క్షేత్రంలో శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయ పునఃనిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన ఆలయం పనులు ఇలా ఉంటే నలుమూలల నుండి యాదాద్రికి భక్తులు రావడానికి 4లైన్ల రోడ్లు ఏర్పాటు చేశారు. హైద్రాబాద్‌ నుండి వరంగల్‌ వెళ్ళే జాతీయ రహదారిని విస్తరిస్తుండగా అదే విధంగా హైద్రాబాద్‌ నుండి యంయంటిఎస్‌ రైలును కూడా రాయగిరి వరకు విస్తరించే విధంగా పనులు జరుగుతున్నాయి. యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం రవాణా సౌకర్యాన్ని ఆధునీకరిస్తున్నారు. దేవాలయాన్ని దష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్డు,రైలు మార్గాలు పూర్తి అయితే యాదాద్రికి వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్యలు తొలిగిపోనున్నాయి.

కొండపైకి వెళ్ళడానికి, రావడానికి వేరువేరు ఘాటురోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఆర్‌టిసి బస్సులను, ప్రైవేటు వాహనాలను క్రింద గుట్ట వద్దనే నిలిపివేసి దేవాలయానికి సంబంధించిన ఉచిత బస్సులను మాత్రమే గుట్టపైకి అనుమతించనున్నారు. ఒక్కసారే లక్షమంది భక్తులు యాదాద్రికి తరలి వచ్చినా వసతులు కల్పించేలా కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. ప్రధాన గుట్టకు ఆనుకుని వున్న పెద్దగుట్టపై 250 ఎకరాల్లో వసతి సముదాయాలను నిర్మిస్తున్నారు. వివిఐపిల కోసం 12విల్లాలను కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గుట్టపై రోడ్డు వేయడంతో పాటు నీరు, కరెంటు సౌకర్యం కల్పించారు. అను వైన ప్రాంతాలలో పచ్చని గడ్డిని పర్చడంతో పాటు ఉద్యానవనాలను ఏర్పాటుచేయడానికి మొక్కలను నాటారు.

Other Updates