హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్‌ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటి, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఐటీ, ఇతర ఉద్యోగులు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నది.. మార్చి 20 వ తేదీ ఉదయం 9.30 గంటలకు అమీర్‌ పేట్‌ ఇంటర్చేంజ్‌ స్టేషన్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం వల్ల నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హైటెక్‌ సిటీకి వెళ్లే మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం అదే రైల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మెట్రో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రయాణించారు.అమీర్‌ పేట్‌ నుంచి ప్రారంభమైన రైలు 20 నిమిషాల్లో హౖెెటెక్‌ సిటీ స్టేషన్‌కు చేరుకుని, తిరిగి అదే ట్రాక్‌పై తిరుగుప్రయాణంలో 18 నిమిషాల్లోనే అమీర్‌ పేట్‌కు చేరుకుంది. ఉదయం గవర్నర్‌ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించగా, సాయంత్రం 4 గంటల నుంచి కొత్త మార్గంలో ప్రయాణికులను అనుమతించారు.ఈ మార్గంలో 9-12 నిమిషాల వ్యవధిలో మెట్రోలను నడిపారు.

ఈ సరికొత్త మెట్రోరైలు మార్గం ప్రారంభం సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ ఎండీ,ఎన్వీఎస్‌ రెడ్డి ఈ ప్రాజెక్టు ఎంతగొప్పదో రెండు దశాబ్దాల తర్వాత అర్థమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు మొత్తం 72 కిలోమీటర్లు. తాజాగా అమీర్‌ పేట్‌ ,హౖెెటెక్‌ సిటీ మార్గం సిద్ధంకావడంతో 56 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ హైటెక్‌ సిటీ మార్గం ప్రారంభం కావడంతో ఢిల్లీ మెట్రో తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రో అవతరించిందని చెప్పారు.

ఇదో ఇంజినీరింగ్‌ అద్భుతమని, ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్‌ అని అభివర్ణించారు. రోడ్డుమార్గాన ప్రయాణించే వాహనంతో పోల్చితే ఒక్కో మెట్రోరైలు ఐదింతలు ఇంధనాన్ని అదాచేస్తుందని తెలిపారు. మెట్రోరైలు వల్ల ప్రయాణంతోపాటు కలిగే ఇతర ప్రయోజనాలను ప్రజలకు చక్కగా అర్థమయ్యేలా వివరించాలని గవర్నర్‌ సూచించినట్టు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.కొత్తగా 8 స్టేషన్లతో అందుబాటులోకి రావాలసిన అమీర్‌ పేట్‌ -హైటెక్‌ సిటీ మెట్రో రైలు మార్గం లో ప్రస్తుతం ఐదు స్టేషన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.మిగిలిన మూడు స్టేషన్లు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లు మే నెల చివరివరకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇతరమార్గాల మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 గంటలకు చివరి మెట్రో అందుబాటులో ఉంటుంది అని పేర్కొన్నారు.

మెట్రో కారిడార్‌ – 3 సంపూర్ణం..
నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు మెట్రో కారిడార్‌-3 కిందకు వస్తుంది,ఇది మొత్తం 27 కి.మీ మార్గం. 2017 నవంబరు 28న ప్రధాని చేతుల మీదుగా 17 కి.మీ. నాగోల్‌-అమీర్‌ పేట్‌ మార్గం ప్రారంభమైంది. మిగిలిన 10 కి.మీ. మార్గం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ కారిడార్‌ నే మరో కిలోమీటర్‌ దూరం మైండ్‌ స్పేస్‌ వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి.

Other Updates