డా|| నలిమెల భాస్కర్‌
తెలంగాణ సీమలోని పల్లె ప్రజల భాషావ్యవహారానికి, ప్రాచీన కావ్య భాషగా చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొన్ని సార్లు మనం ఆశ్చర్య పోవడం కద్దు. ఉదాహరణకు పోతన తన భాగవతంలో వాడిన కొన్ని పదాలకూ, తెలంగాణ పలుకులకూ వున్న సామిప్యాన్ని చూద్దాం. భాగవతంలోని ఆయా స్కంధాల ప్రారంభంలో పద్యం తరువాత ”మహనీయ గుణ గరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియె” అని వుంటుంది. ఇక్కడ ”సూతుండు ఇట్లనియె” అని ఆఖరున వుంది. ఇప్పటికీ పల్లెల్లో ”వాడు నిన్న నన్ను ఇట్లనె. వీడు నిన్ను అట్లనె. ఇగ ఎట్ల చేద్దాం” అనే తీరు మాటలు వింటాం. ”ఇట్లనియె” అనే ప్రాచీన రూపం తెలంగాణలో ”ఇట్లనె” అవుతున్నది. ”ఇలా అన్నాడు” అనే ఆధునిక రూపం తెలంగాణలో లేదు. ”అనియె” అనే క్రియ కాలక్రమంలో ”అనె”గా మారిపోయింది.

”చనిన వారి చనువారి చనెడివారి చెప్పవే” అని ఒకానొక సందర్భంలో పరిక్షిత్తు శుకమహర్షిని అడుగుతాడు. శుకునితో ఆ రాజేంద్రుడు ”చెప్పవా” అని గానీ, ”చెప్పరా” అని గానీ అనకుండా ”చెప్పవే” అంటున్నాడు. ఇప్పటికీ పల్లెల్లో రావే, పోవే, చెప్పవే, చేయవే అనే మోస్తరు మాటలు చాలా సహజంగా విన్పిస్తాయి. మరో చోట ”భువి పుణ్యుల చరిత విన పుణ్యము కాదే”, ”మియ్యంతటి వారి కొండు మేరయు కలదే” అంటూ ఏకారాంత పదాలు పోతనలో చూస్తాం. పోతనలోనే కాదు ఈ మాదిరి అభివ్యక్తి పదాలు ప్రాచీన కవులందరిలోనూ కన్పిస్తాయి.

”యాగము నీ యనుజ్ఞనే చేయంగా”, నీవు మెచ్చంగ చూడు”, ”భూమి భారము మాన్పంగ పుట్టినాడు” మొదలైన పద్యపాదాల్లో ”చేయంగా, మెచ్చంగ, మాన్పంగ” వంటి అనంత రూపాలున్నాయి. వీటిని ”చేయగా, మెచ్చగ, మాన్పగ” అని రాసినా అర్థ భేదం లేదు. కానీ ”చేయగా” వంటి పూర్ణ అనుస్వార రూపాలు నాదాల్ని కల్గివున్నాయి. ఆ నాద భరిత రూపాలెన్నో తెలంగాణ ప్రజల్లో యిప్పటికీ వున్నాయి. వాడు అనంగనంగ వచ్చిండు. ”చెప్పంగ విననోన్ని చెడంగ చూడాలె”, ”ఎదురు చూడంగ ఎదురు చూడంగ వచ్చిండు”… ఇటువంటి ప్రకటనలన్నీ పై కోవకు చెందినవే!

”మనువు కొమరిత మగతనంబు కొఱకు నేక చిత్తంబున హరిన్‌ పొగడిన”.. ఇదీ పోతనదే ! ఇందులో ”ఏక చిత్తంబున” అని వుంది. అది తెలంగాణలో ”ఒక్క చిత్తం” అయిపోయింది. ”ఏ..ఆ పని చేస్తే ఒక్క చిత్తం తియ్యి. ఒక్క చిత్తం చేసుకుంటేనే ఏ పని అయినా అయితది. ”ఇవి ప్రజల పలుకుబళ్లు ”ఏక” అన్నా ”ఒక్క” అన్నా ఒక్కటే కదా! మరోచోట ”ప్రబ్బికొనిన పెంబకటి” అని పోతన రాస్తే, చెట్ల పాదులకూ, చెట్ల గుడ్డలకూ చుట్టూ పబ్బులు పాతుతారు పల్లీయులు. బీర, సోర వంటి మొక్కలు తీగజాతివి కనుక అవి మొదట పెరగడానికి చుట్టూ చిన్న చిన్న పుల్లలు నాటుతారు. అవే పబ్బులు, ప్రబ్బు అంటే వ్యాపించు అని అర్థం. తీగలు వాటిపైకి ప్రాకి వ్యాపించడానికి ఉండేవే పబ్బులు.

”అరేయ్‌! నీ పని నువ్వు చేసుకుంట పోతే కుదురదిరా! నల్గురు మెచ్చతిరుగాలె” అనే హితబోధ పెద్దలు చేస్తుంటారు. పోతన సైతం ”మిగుల పనుల యొడల మెచ్చ దిరిగి” అన్నాడు. ”ఆటపాటలతోటి పని జేస్తే చేసినట్టే అన్పించది”, వాడు ఆటలు పాటల్తోటే చదువుతాడు. చదివినట్టే అన్పియ్యది”ల్లోని ఆటపాటలు ”ఆటపాటలు సలుపగ” అని వుంది పోతనలో, అతడు సహజపండితుడు, తెచ్చి పెట్టుకున్న పాండిత్యం కాదు ఆయనది. బమ్మెర అనే పల్లెలో పుట్టి ప్రజల పలుకుబడినీ, జీవనాడినీ పట్టుకున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా అనేక కారణాల వల్ల ప్రాచీన పలుకుబడిని నిలుపుకున్నారు. నిలుపుకొవడమే కాక అవలీలగా సంభాషణల్లో దాన్ని దొర్లిస్తున్నారు. ”తొడంబుట్టువులను” అనే పరమ ప్రాచీన రూపానికి ”తొడవుట్టినోల్లను” అనేది సమానార్థకంగా వుంది. ఏదో ఒక సందర్భంలో పోతన ”నెమక పంపె” అన్నాడు. ”నెమకు” అంటే వెదకు అని అర్థం. ఈ ”నెమకు” తెలంగాణలో ముందు ”లెమకు”, పిదప ”లెమకు” అయ్యి చివరికి ”లెంకు” అయ్యింది. ”లెంకపొయిండు” అంటే వెదకవెళ్ళాడనే! ”తనకు పోరాని రారాని తలములేక” అని పొతన అంటే ”ఏడ తలం చేసుకోవాల్నో ఎరుకైతలేదు” అని పల్లెవాసులు అంటున్నారు. తలము అంటే నివాస యోగ్యమైన స్థలము. ”చరువు చేసి క్రుంక చనియె నదికి”లోని ”చరువు” ఏమిటో కాదు తెలంగాణ ”సర్వ”. హవ్యము వండెడి కుండను చరువు అంటారు. అదే ఇవాళ తెలంగాణలో ”సర్వ”గా వున్నది. పైగా ”సర్వపిండి” మనందరికీ ఎఱుకే! ఒకచోట ”సేమం బరసి” అని వుంది. అంటే మంచి చెడ్డలు తెలిసికొనే అర్థం. ఇప్పటికీ ”మీరు మెన్న మీ సుట్టాల పెండ్లికి పొయిండ్రుగదా! మంచిగ అర్సుకున్నరా మరి!” అని అడుగుతుంటారు.

”ఇట్ల నేసి శర్మిష్ఠ పోయిన వెనుక” అనేది పోతన మాటలు. ఈ ”పొయిన వెనుక” తెలంగాణలో ”పోయినంక” అని వుంది ఈనాటికీ. చూసినంక, నవ్వినంక, చేసినంక అనే రూపాలన్నీ చూసిన వెనుక, నవ్విన వెనుక, చేసిన వెనుకల నుండి పుట్టినవి. వెనుక అంటే ఇక్కడ తరువాత అని అర్థం.

ఇంకా ”కాలము పుచ్చుచున్‌, ప్రొద్దుపోకొకనాడు, ప్రొద్దు గడుపుచుండె, ప్రొద్దులు పుచ్చెన్‌”… యిత్యాదులు కొంత మారిపోయి తెలంగాణ పలుకుబడిలో వున్నాయి. ”కడుపు సేసె, గర్భంబుదించుకొమ్ము, నీళ్ళాడ సంకటపడుచున్న ”మొదలైనవీ దాదాపు యథాతథంగా వున్నాయి. ”పురుడు, చెల్లెలు, పెక్కునాళ్ళగోలె”… ఇవి ”బారసాల, చెల్లాయి, అనేక రోజుల నుండి” అనే ప్రమాణ భాషారూపాలలో గాక సుమారు, ఉన్నవి ఉన్నట్లుగా తెలంగాణలో వున్నాయి. ”ఎమో… పండుగ్గోలె వచ్చినవ్‌”లో ఈ ”గోలె” వుంది. అది ”కోలెన్‌” అనే ప్రత్యయం. ఇట్లా తెలంగాణ పలుకుబడిలో ప్రాచీన కావ్య భాషా రూపాలు పరిశీలించాలే గాని అనేకం గోచరిస్తాయి.

Other Updates