కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) ఆవార్డును ఈ ఏడాదికి తెలంగాణ మైనర్ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కె.శ్యామ్ సుందర్ అందుకున్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖా సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ఈ ఆవార్డును అందించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) జ్యూరీ ఇటీవలనే శ్యామ్ సుందర్‌ను ఈ ప్రతిష్ఠాత్మక ఆవార్డు కోసం ఎంపిక చేసింది. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు పాటు పడుతున్నందుకు ఈ అవార్డు లభించింది. సాగు నీటి రంగంలో విశేష కషి చేసి దేశంలోనే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ పలు రంగాల్లో అగ్రగామిగా నిలిపినందుకు ఈ ఆవార్డు కోసం ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది.
నీటిపారుదల నిల్వలు, సరస్సుల పునరుద్ధరణ విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అవార్డు మిషన్ కాకతీయకు దక్కింది. అవార్డుల కార్యక్రమ అనంతరం తెలంగాణ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, మార్చి 12, 2015 లో కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో మిషన్ కాకతీయ పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారని, కేసీఆర్ దూర దష్టితో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. గ్రామీణ జీవనాన్ని బలోపేతం చేసే దిశలో సిఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారని, మిషన్ కాకతీయ సాధిస్తోన్న విజయాలను తెలుసుకునేందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అసక్తి చూపించాయని శ్యామ్ సుందర్ పేర్కొన్నారు.