శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నిక మార్చి 12న శాసనసభ భవనంలో జరిగింది. ఈ ఎన్నికలో 5 గురు సభ్యులు ఎన్నికయ్యారు. మొత్తం 119 మంది సభ్యులకు గాను 91 మంది టీఆర్‌ఎస్‌, 7గురు ఎంఐఎం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికైన సభ్యుల్లో 4గురు టీఆర్‌ఎస్‌ సభ్యులు కాగా ఒకరు ఎంఐఎం సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. టీఆర్‌ఎస్‌ వైపున హోం మంత్రి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ఖనినాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గె మల్లేశంలు, ఎంఐఎం నుండి మీర్జా రియాజుల్‌ హసన్‌లు ఎన్నికయ్యారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. అధికారి శంశాంక్‌ గోయల్‌ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. అనంతరం 5 గంటలకు కౌంటింగ్‌ జరిగింది. ఫలితాల ప్రకటన అనంతరం రిటర్నింగ్‌ అధికారి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు విజేతలకు ధృవపత్రాలు అందచేశారు.

 

ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల  ఫలితాలు

ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి సభ్యులకు జరిగిన ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికల్లో టి. జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయుల ప్రతినిధుల ఎన్నికల్లో టి.నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డిలు ఎన్నికయ్యారు.

కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఎన్నిక ధృవీకరణ ప్రతాన్ని అందచేశారు. మొత్తం చెల్లుబాటైన ఓట్లు 1,05,427 కాగా అందులో జీవన్‌రెడ్డికి 56,698 ఓట్లు వచ్చాయి. 39,430 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే ఆయన గెలుపొందారు.

కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి కె.రఘోత్తంరెడ్డి గెలుపొందారు. మొత్తం చెల్లుబాటైన ఓట్లు 18,814 ఓట్లు ఉండగా, అందులో రఘోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓట్లు 5,462 వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా 1707 ఓట్ల మెజారిటీతో రఘోత్తంరెడ్డి ఎన్నికయ్యారు.

నల్లగొండ – ఖమ్మం – వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 8,976 ఓట్లు రాగా, రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. లెక్కింపు పూర్తి అయిన తరువాత నర్సిరెడ్డికి 9,021 ఓట్లు రాగా నర్సిరెడ్డి గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌ ప్రకటించారు.

Other Updates