ఇంత కాలం

నీరు పల్లానికే పారుతుందని అనుకున్నా!

ఇప్పుడు తెలిసింది

నీరు ఎత్తుకూ పారగలదని,

ఎత్తి పోతలలో పోటెత్తగలదనీ!

ఇప్పుడు,

చుక్కపొద్దున లేచి

మోట గొట్టే పాలేరు గుర్తుకొస్తున్నడు.

ఆయిల్‌ ఇంజన్‌తో

వరిమడి తడిపే

రైతన్న గుర్తుకొస్తున్నడు.

అర్ధరాత్రి కరెంటు తీగకు

బలైన అన్నదాత యాది కొస్తున్నడు.

దిగుడు బావుల్లో

బుంగలతో

నీళ్ళు తేవడం గుర్తొస్తోంది.

మండువేసవిలో

దిగుడు బావి చెలిమలో

గిన్నెతో నీళ్ళు తోడటం

మరవ తరమా!

గిలక బావుల్లో

బకెట్టుతో నీళ్ళు తోడడం

బావిలో పడిన బకెట్టు కోసం

పాతాళ గరిగతో వెతకడం యాదికే.

బాల్యమంతా

నీటి వేటలో గడిచింది

పాతాళంలో వున్న

బోరు బావిలో నీటికై

బాల భగీరథులమై

చేతులు బొబ్బలెక్కంగ

బోరు కొట్టడం జ్ఞాపకం.

ప్లాస్టిక్‌ బిందెలకు తాళ్ళుకట్టి

సైకిళ్ళ కావడిపై

నీళ్ళు మోసుకొచ్చే

ఆధునిక శ్రవణ కుమారులవడం జ్ఞాపకమే.

పంపు నీళ్ళకై ఎన్ని రాత్రులు

నిదురకాచి ఎదురుచూశామో

బిందెడు నీళ్ళకై

వీధి వీధి తిరగడం యాదికుంది.

ఇప్పుడు,

బటన్‌వేసి నీళ్ళు పట్టే

నేటి తరానికి

ఇది వింతగానే తోస్తంది.
tsmagazine

మొన్నటిదాక,

చెరువంటే నీళ్ళులేక

నోళ్ళు తెరచిన బీళ్లు.

నేడో,

చెరువంటే,

నీటితో కళకళ లాడే టాంక్‌ బండ్‌

ఊరి చెరువులన్నీ

మిషన్‌ కాకతీయతో

అవి పర్యాటక ప్రాంతాలు

ఊరికి ఉపాధి కేంద్రాలు !

ఇంటింటికి కుళాయిలతో

మంచి నీళ్ళనందించే ‘మిషన్‌’

ప్రభుత్వ ‘భగీరథ’ ప్రయత్నమే.

బంగారు కలలు

ఎందరో కంటుంటారు

నీటి కలల్ని

ఒక్క పాలమూరు

ప్రజలే కన్నారు.

ఎండిన చెరువును చూసి

కన్నీళ్ళు పెట్టిన కళ్ళే

నిండిన చెరువుల్ని చూసి

ఆనంద భాష్పాలు రాల్చింది.

వలస బోయిన పాలమూరుకు

వరదలా వచ్చిన జలాలు.

రైతులకిది జలోత్సవం.

కవులకిది జల కవితోత్సవం.

– కమలేకర్‌

శ్యామ్‌ ప్రసాద్‌ రావు

Other Updates