tsmagazine
తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి ఆయన నామినేషన్‌ ఒక్కటే దాఖలు కావడంతో ప్రోటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఆయనను స్పీకర్‌గా ప్రకటించారు. శాసనసభలో కరతాళధ్వనులు మారుమ్రోగాయి. సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శాసనసభ్యులు ఈటల రాజేందర్‌, ఎంఐఎం శాసనసభ్యులు బలాలా తదితరులు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అధ్యక్షస్థానం వద్దకు తోడ్కొని వెళ్ళారు. ముఖ్యమంత్రి స్వయంగా స్పీకర్‌ను అధ్యక్షస్థానంపై కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహమూద్‌ అలీ, పలువురు శాసనసభ్యులు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. ఆయన సేవలను కొనియాడారు.

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, స్పీకర్‌ ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్ష నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి, ఎంతో అనుభవమున్న పోచారం స్పీకర్‌గా తెలంగాణ శాసనసభ సత్సంప్రదాయాలను కొనసాగిస్తు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశించారు. తెలంగాణ ఉద్యమం కోసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమానికి ఊపిరులూదారని సీఎం పోచారంను కొనియాడారు. ”మీరు వ్యవసాయమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర ఎన్నో విప్లవాత్మక పథకాలు రూపొందించబడి, అమలు చేయబడ్డాయి. ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అందుకే మిమ్మల్ని లక్ష్మీపుత్రుడుగా నేను పేరుపెట్టాను. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ పెద్దగా ఉన్న మీరు ఉమ్మడి రాజకీయవేదికకు స్పీకరయ్యారు. ఉమ్మడి కుటుంబాన్ని ఎలా చూస్తున్నారో, శాసనసభ కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి.్ణ అని ముఖ్యమంత్రి కోరారు.

హోం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ స్పీకర్‌ పదవికే వన్నె తెస్తారని ఆకాంక్షించారు. కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ తదితరులు మాట్లాడారు. సభ్యులందరినీ సమదృష్టితో చూడాలని కాంగ్రెస్‌ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌బాబులు కోరారు.

అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ”ఎందరో మేధావులు, అనుభవజ్ఞులు ఉన్న ఈ శాసనసభలో నాకు స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించడం నా మీద మీకు ఉన్న గౌరవానికి కృతజ్ఞతలు. ప్రజాహితమే ధ్యేయంగా అందరి సహకారంతో సభను నడిపిస్తా..” అన్నారు. సభా నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకోవాలన్నారు. నైతిక సూత్రాలు, నిబంధనలు, విధులను సభ్యులు సక్రమంగా పాటించాలన్నారు. కాలాన్ని సద్వినియోగపరచుకుని, ప్రజా సమస్యలను చర్చించాలని సూచించారు. అనంతరం పలువురు శాసనసభ్యులు, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు స్పీకర్‌ను అభినందించారు.

ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌..

తెలంగాణ రెండవ శాసనసభ ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయన చేత ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రోటెం స్పీకర్‌ శాసనసభలో ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రోటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ ఎన్నిక జరిగింది.

నామినేటెడ్‌ శాసన సభ్యునిగా స్టీఫెన్‌సన్‌
tsmagazine

ఆంగ్లో ఇండియన్‌ల తరఫున అసెంబ్లీకి నామినేట్‌ చేసే శాసన సభ్యునిగా ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ మళ్లీ నియామకమయ్యారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో స్టీఫెన్‌సన్‌ను మరోసారి నామినేట్‌ చేస్తూ తీర్మాణించారు. ఈ తీర్మాణాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు పంపగా ఆయన ఆమోదించారు. ఈ ప్రకారం ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. ఎన్నికల సంఘానికి కూడా సమాచారాన్ని అందించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ స్టీఫెన్‌సన్‌ను నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా నియమిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Other Updates