tsmagazine
గణతంత్ర దినోత్సవ సందేశంలో గవర్నర్‌
”దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తున్నది. గడిచిన నాలుగున్నర ఏండ్లు తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయి. కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం అన్ని రంగాలలో పునర్నిర్మాణ ప్రక్రియను ఉజ్వలంగా చేపట్టింది. ఒకవైపు దృఢమైన నాయకత్వాన్ని అందిస్తూ మరోవైపు రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పింది. ప్రగతి పథంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిని, సామరస్యాన్ని నెలకొల్పుతూ అన్ని వర్గాల అదరాభిమానా లను చూరగొన్నది. అనతికాలంలోనే బాలారిష్టాలను అధిగమించి అద్భుత విజయాలను సాధించింది. ప్రజా సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. అందుకనే గత ఎన్నికలలో ప్రజలు కె. చంద్రశేఖర రావు నేతృత్వానికి, వారి ప్రభుత్వ విధానాలకి మరోసారి పెద్దఎత్తన మద్దతుపలికారు. అఖండ విజయాన్ని అందించారు. రెండవసారి అధికార బాధ్యతలను చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నది” అని గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తన గణతంత్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.

నేడు రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వ పరిపాలనని సంక్షేమంలో స్వర్ణయుగంగా పేర్కొనటం సముచితం. దేశంలో మరే రాష్ట్రంలో కూడా, సంక్షేమం కోసం, ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించటం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అనుసరించి వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయోపరిమితిని ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గిస్తున్నది. పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి ఇవ్వబోతున్నది.

తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం సాగునీటి డిమాండ్‌. అందుకే ప్రభుత్వం తెలంగాణ రైతాగం ఆశలు నెరవేర్చడం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తరమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఈ ప్రయత్నంలో ప్రతీఘాతక శక్తులు కల్పించిన అనేక అవరోధాలను ఉక్కు సంకల్పంతో అధిగమించింది. అంతర్‌ రాష్ట్ర వివాదాలకు సామరస్య పరిష్కారాలను కనుగొన్నది. కేంద్రం నుంచి, వివిధ ప్రాధికార సంస్థల నుండి అటవీ, పర్యావరణ, ఇతర అనుమతులను సాధించింది. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తున్నది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఈ వర్షాకాలం నుంచే అందే విధంగా ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నది. పాలమూరు – రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులు అనతికాలంలో పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఈ ఐదేళ్ళ వ్యవధిలోనే, ”సస్యశ్యామల తెలంగాణ” ఆకృతి దాల్చే విధంగా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తున్నది.

తెలంగాణకు బహుళ ప్రయోజనాలకు చేకూర్చే పథకం మిషన్‌ కాకతీయ. ఈ పథకం వల్ల నేడు రాష్ట్రంలో వేలాది చెరువులు పునరుద్దరణకు నోచుకొని కళకళలాడుతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలమట్టం గణనీయమైన స్థాయికి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సాగునీటి కల్పన కోసం ప్రభుత్వం 99,643 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం లక్షా 7వేల కోట్లు ఖర్చవుతుంది. రాబోయే కాలంలో మరో లక్షా 17 వేల కోట్ల అంచనాతో పనులు జరుగుతాయి. గోదావరి, కృష్ణ బేసిన్ల లో తెలంగాణ రాష్ట్రానికున్న 1300 టిఎంసిల నీటి వాటాను వాడుకోవడానికి 2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో పనులన్నింటినీ పూర్తి చేసి, కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తున్నది.

ప్రజలకు అతి ముఖ్యమైన అవసరం తాగునీరు. తాగునీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ అనే బృహత్తర పథకం చేపట్టింది. దేశ చరిత్రలోనే అపూర్వమైన ఈ తాగునీటి పథకం దాదాపుగా పూర్తి కావచ్చింది. సాగునీటి వసతులలో మెరుగుదల రావటంతో పాటు, 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుండటంతో రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశంలో వ్యవసాయరంగానికి ఉచితంగా, నాణ్యమైన విద్యుత్తును, 24 గంటల పాటు సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా తెలియజేస్తున్నాను.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైన మార్పుకు దోహదపడుతున్నాయి. రైతులలో ఆత్మ విశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. రైతు బంధు పథకం జాతీయ ఎజెండాలో భాగంకావడమే కాకుండా ఐక్యర్యాసమితిచేత ప్రశంసలు పొందింది. అనేక రాష్ట్రాలు తెలంగాణ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. రైతు బంధు, రైతుబీమా పథకాలతో తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక రోల్‌ మోడల్‌గా నిలవటం మనందరికీ గర్వకారణం. రైతుబంధు పథకం ప్రయోజనాలను సమర్థవంతంగా ప్రజలకు చేర్చడం కోసం ప్రభుత్వం ముందుగా సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను సమర్థవంతగా జరిపించింది. 94 శాతం భూముల యాజమాన్య వాక్కులను తేల్చడమే కాకుండా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండానే కొత్త పాస్‌ బుక్కులను ప్రభుత్వం అందించింది. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పాదర్శకత కోసం ఉద్దేశించిన ”ధరణి” వెబ్‌సైట్‌ త్వరలో ప్రారంభం అవుతుంది.

ఒకవైపు వ్యవసాయాన్ని కుదుటపరుస్తూనే, మరోవైపు వ్యవసాయ అనుబంధ వృత్తులను నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నది. కూలిన కులవృత్తులకు ఆర్ధిక ప్రేరణతో పాటు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, ఆ వృత్తులను నిలబెట్టే కార్యక్రమాలు అమలు చేస్తున్నది. తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టిని చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు భయంకరమైన విద్యుత్‌ సంక్షోభం వుండేది. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ప్రకటించేవారు. కరెంట్‌ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వుండేది. వ్యవసాయానికి మూడు, నాలుగు గంటల కరెంట్‌ కూడా ఉండేది కాదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు అవస్థలు పడేవారు. పంటలు ఎండిపోయి ఆర్ధికంగా బాగా నష్టపోయారు. గృహ విద్యుత్‌ కూడా గంటల తరబడి కోతలు విధించే వారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల విద్యుత్‌ కొరత వుండేది. ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసుకున్నది.

రాష్ట్రంలో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన విధంగా విద్యాబుద్ధులు నేర్పించడం కోసం, కెజి నుంచి పిజి ఉచిత విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం పెద్దఎత్తున రెసిడెన్షియల్‌ విద్యాలయాలను నెలకొల్పింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడం కోసం, సకల వసతులతో కొత్తగా 542 రెసిడెన్షియల్‌ స్కూళ్ళను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 119 బిసి రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభించుకోబోతున్నామని సంతోషకర వార్తను మీతో పంచుకుంటున్నాను.

ప్రజల ప్రాణాలు నిలబెట్టి ప్రజారోగ్య వ్యవస్థను, పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అవాంఛనీయమైన ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయాలని, అసుపత్రిలో సురక్షిత ప్రసవాలు పెరగాలనే ఉద్దేశ్యంతో ”కె.సి.ఆర్‌ కిట్‌” పథకం ప్రవేశ పెట్టింది. ప్రజల దృష్టిలోపాల నివారణ కోసం, చికిత్స అందించటం కోసం, ప్రవేశ పెట్టిన ”కంటి వెలుగు” పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది. త్వరలో చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధుల నివారణ కోసం వైద్య బృందాలతో ఊరూరా శిబిరాలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మరణించిన పేదల మృతదేహాలను వారి స్వగ్రామాలకు ఉచితంగా చేర్చేందుకు ప్రభుత్వం పరమ పద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వ ఆసుపత్రులంటేనే అపనమ్మకం, అనుమానాలున్న పరిస్థితి నుంచి నేడు ప్రభుత్వం ప్రజా వైద్యంపై విశ్వాసం పెంచింది. పేదల నివాసాలు నివాస యోగ్యంగా, గౌరవ ప్రదంగా, ఉండాలనే సదుద్దేశ్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదులతో కూడిన పక్కా ఇళ్ళను ఉచితంగా నిర్మించి ఇస్తున్నది.

రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగటమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నది. సత్వర పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు పొందేందుకు ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోని విధంగా టిఎస్‌ ఐ-పాస్‌ చట్టం తెచ్చింది. ఐటి రంగంలో నూతన అన్వేషణలకు వేదికగా నెలకొల్పిన ”టి-హబ్‌” అంకుర సంస్థలకు అండగా నిలుస్తున్నది.

మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్య భావనను బలోపేతం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని రూపొందించింది. గ్రామ పాలన, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనాన్ని పెంపొందించుకోవడంలో ప్రభుత్వం సంస్కరణలు చేపడుతున్నది.

తెలంగాణ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాల్లో 17.17 శాతం వార్షిక సగటు వృద్ధి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నాటికి 29.93 శాతం వృద్ధి రేటు సాధించి, దేశంలోనే ప్రథమంగా నిలిచింది.

ప్రభుత్వం తదేక దీక్షతో తపస్సు వలె పని చేయడం వల్లనే ప్రజలు గత ఎన్నికలలో తమ నిండు దీవెనలను అందించారు. రాబోయే కాలంలోనూ, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా, ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతుంది. పేదరికం, అశాంతి, అలజడి లేకుండా, పసిడి పంటలతో తులతూగుతూ, అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధిని పొందే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతుందని సవినయంగా ప్రకటిస్తున్నాను. యావత్‌ తెలంగాణ ప్రజానీకానికీ మరోమారు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జై హింద్‌ ! జై తెలంగాణ !!

Other Updates