tsmagazineతెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైంది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టి.బి.ఎన్‌. రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన సంవత్సర వేళ జనవరి 1వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌, జస్టిస్‌ రాధాకృష్ణన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా హాజరయ్యారు.

అనంతరం గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావులు జస్టిస్‌ రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు కొత్త న్యాయమూర్తులను కూడా కలుసుకొని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ న్యాయవాదులు పెద్దసంఖ్యలో హాజరైనారు.tsmagazine

అనంతరం, హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ రాధాకష్ణన్‌ మిగిలిన 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. చౌహాన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచంద్రరావు, జస్టిస్‌ ఎ. రాజశేఖర రెడ్డి, జస్టిస్‌ పి. నవీన్‌ రావు, జస్టిస్‌ చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్‌ బి. శివ శంకర రావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ పి. కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి. అమరనాథ్‌ గౌడ్‌ ఉన్నారు.

ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్‌, న్యాయమూర్తుల కేటాయింపులకు సంబంధించిన నోటిఫికేషన్లను, ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో ప్రమాణం చేయించడానికి గాను రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర రెడ్డి చదివి వినిపించారు.

తెలంగాణ హైకోర్టు ఆవిర్భవించడంతో పని విభజనలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్ కొత్త బెంచ్‌ లను ఏర్పాటుచేశారు. ప్రధాన న్యాయమూర్తితో సహా మొదటి ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తుల నేతత్వంలో ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. గతంలో ఉమ్మడి హైకోర్టు వెబ్‌ సైట్‌ స్థానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు విడివిడిగా కొత్త వెబ్‌ సైట్లను రూపొందించారు.

Other Updates