tsmagazineసీనియర్‌ జర్నలిస్టు, ప్రముఖ కవి ఎ.కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్‌దేవ్‌ రాసిన కవితలను ‘గుప్పెడు సూర్యుడు-మరికొన్ని కవితలు ‘పేరిట తెలుగులో అనువదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ కృష్ణారావుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

భారతీయ స్త్రీ ఎదుర్కొనే సామాజిక అన్యాయం, సుఖ దుఖాలతోపాటు, దేశ విభజన సమయంలో తన తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి మానసిక వేదన ఈ కవితల్లో వ్యక్తీకరించారని, కష్ణారావు వాటిని తెలుగులోకి అద్భుతంగా అనువదించారని సాహిత్య అకాడమీ ప్రశంసాపత్రంలో పేర్కొన్నది.మహబూబ్‌ నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామానికి చెందిన కృష్ణారావు మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికలలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఇండియాగేట్‌, హీనచరిత్ర, ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి వంటి అనేక రచనలు ఆయనకు మంచి పేరుతెచ్చాయి. ఇవిగాక అనేకమంది ప్రముఖుల రచనలను ఆయన అనువదించారు. కృష్ణారావు ఉత్తమ జర్నలిస్టుగా ప్రతిష్టాత్మకమైన ఎన్‌.ఆర్‌.చందూర్‌, మోటూరి హనుమంతరావు, తాపీ ధర్మారావు పురస్కారాలను కూడా అందుకున్నారు. కవిగా ఆయనకు ఆలూరి బైరాగి పురస్కారం లభించింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోనున్నారు.

ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ హర్షం

కృష్ణారావుకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, కవిగా,రచయితగా సేవలందించిన కృష్ణారావు ఈ అవార్డుకు అర్హుడని సి.ఎం. అభిప్రాయపడ్డారు. పాత్రికేయ వృత్తిలోనూ, సాహిత్యరంగంలోనూ ఆయన మరింత ఎదగాలని, తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Other Updates