ఎస్. శ్రీనివాసరావు
సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించాలంటే వృధాగా పోతున్న, సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడమే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుని మూడు జిల్లాలలోని బీడు భూములకు పుష్కలంగా సాగునీరు అందించడమే
ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. మహోన్నతాశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చురుకుగా సాగుతున్నాయి.
ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు కావాల్సిన అనుమతులపై జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఇటీవల ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ వలన ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటవీశాఖ అనుమతులు లభించడంతో మొదటి దశ ప్రధాన కాలువల నిర్మాణానికి అడ్డంకులు తొలగి పోయాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మహబూబాబాద్ జిల్లాకు సైతం నీరు అందనున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ పేరుతో చేపట్టిన దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో పాటు గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించాలని ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రూపకల్పన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ రెండు ప్రాజెక్టులకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి కెసిఆర్ మన రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 3.29 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూప కల్పన చేశారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి స్వయంగా శంకు స్థాపన చేసి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. పర్యావరణ అనుమతుల కోసం గత సంవత్సరం అక్టోబర్ 27న ఢిల్లీలో జరిగిన సమావేశం లో సీతారామ ప్రాజెక్టు అధికారులు పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరిన సమాచారాన్ని, నివేదికలను అందచేశారు. అపోహలు నివృత్తి చేసుకోవడానికి మరికొంత సమాచారం, వివరాలు అందచే యాలని కేంద్ర మంత్రిత్వశాఖ అధికారులు కోరడంతో గత సంవత్సరం నవంబర్ 26న ఢిల్లీల్లో నిర్వహించిన సమావేశంలో కేంద్రప్రభుత్వం కోరిన అన్ని రకాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యావరణ మంత్రిత్వ శాఖకు అందచేశారు. సీతారామప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖాధికారులు, నిపుణులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సీతారామ ఎత్తిపోతల పథకం అధికారులు సమాధానం ఇచ్చారు.
దీంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేసి క్లియరెన్సును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జనవరి 3న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున పదవీ విరమణ పొందిన ఐదుగురు ఇంజనీర్ల బృందాన్ని పనుల పరిశీలనకు పంపిచారు. ఇంజనీర్ల బృందం హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా మణుగూరు చేరుకుని అక్కడ నుండి అశ్వాపురం మండలం బిజి కొత్తూరు నందు జరుగుతున్న పంప్ హౌజ్ పనులు, పాల్వంచ మండలం నాగారం వద్ద జరుగుతున్న అక్విడెక్ట్ నిర్మాణ పనులు, అలాగే ముల్కలపల్లి మండలం వడ్డుగూడెం వద్ద జరుగుతున్న పంప్‌హౌజ్ నిర్మాణ పనులు, కమాలాపురం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన బృందం ముఖ్యమంత్రికి నివేదిక అందచేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన సుమారు 3800 ఎకరాలకు అటవీ అనుమతులు మంజూరయినట్లు సంబంధిత అధికారులు ఇంజనీర్ల బృందానికి చెప్పారు.
అశ్వాపురం మండలం బిజి కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఈ సంవత్సరం జూన్ మాసాంతం వరకు పూర్తవుతాయని చెప్పారు. మొదటిదశ ప్రాజెక్టు నిర్మాణంలో నీటిని ఎత్తిపోయుటకు 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు (షాంగై) మోటార్ల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు మోటార్లకు గాను ఐదు మోటార్లు ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నదని, ఇంకా ఒక మోటారు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉన్నదని, ఆ ఒక్క మోటారు కూడా వస్తుందని, రాగానే మోటారు ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 110 కి.మీ. మేర పంటకాలువల నిర్మాణాలు చేపట్టారు. దీనిలో ఇప్పటి వరకు 40 కిమీ మేర పనులు పూర్తి కాగా, మిగిలిన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ప్రాజెక్టును సందర్శించిన రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణుల బృందం ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల రైతుల భూములకు సమృద్ధిగా సాగునీరు అందించు జీవదాయినిగా ఉపయో గపడుతుందని చెప్పారు. ఈ జూన్ మాసాంతం వరకు ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు ఒక లింగ్ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ కాలువకు ఈ ప్రాజెక్టు కాలువ అనుసంధానం చేయడం ద్వారా ఇరు జిల్లాలలోని సుమారు 90 వేల ఎకరాలు అభివృద్ధిలోనికి రానున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం పనులు చురుకుగా సాగుతున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి కావల్సిన భూమిని అందచేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇంజనీర్ల బృందం అభినందించింది.