సింగరేణి సంస్థను గత ఐదేళ్ల కాలంగా అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సంస్థ సి.ఎం.డి. ఎన్. శ్రీధర్‌కు మరో అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వత్తి నైపుణ్య, వినూత్న ఆలోచన ప్రోత్సాహక వేదిక అయిన ‘అఛీవ్‌మెంట్ ఫోరం’ వారు ఈ ఏడాదికి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ”మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు”ను ఎన్.శ్రీధర్‌కు బహూకరించి ఘనంగా సత్కరించారు.
లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రాంగణంలో ఏప్రిల్ 12న జరిగిన అఛీవ్‌మెంట్స్ ఫోరం-2019 సభావేదికపై ‘గ్లోబల్ క్లబ్ ఆఫ్ లీడర్స్’ సంస్థ అధ్యక్షులు,ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ అలయెన్సు’ (సీనియర్ ఎగ్జిక్యూటీవ్ గ్రూపు) వ్యవస్థాపకులు, ‘న్యూవరల్డ్ ఇన్‌సైట్’ సి.ఇ.ఓ. మిసెస్ క్రిస్టినా బ్రిగ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇ.బి.ఎ. (యూరోప్ బిజినెస్ అలయెన్సు) ప్రొఫెసర్ జాన్ నెట్టింగ్ లు సింగరేణి ఎన్.శ్రీధర్‌కు ఈ అవార్డును, సైటేషన్‌ను బహూకరించి తమ అభినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొత్త తరహా ఆలోచనలతో కంపెనీలను విజయపథంలో నడిపిస్తున్న సి.ఇ.ఓ. (చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్) సేవలకు గుర్తింపుగా తాము ప్రతీ ఏడాది ”మేనేజర్ ఆఫ్ ది ఇయర్” అవార్డును బహుకరిస్తున్నామని, బిజినెస్, ఎకానమీ విభాగంలో ఈ ఏడాది సింగరేణి కాలరీస్ కంపెనీ సి.ఇ.ఓ. (సి.ఎం.డి.) ఎన్.శ్రీధర్‌ను ఆయన చేస్తున్న విశిష్టమైన కషికి గుర్తింపుగా ”మేనేజర్ ఆఫ్ ది ఇయర్” గా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించి ప్రశంసలు కురిపించారు.
సింగరేణి సి.ఎం.డి. ఎన్.శ్రీధర్ సారథ్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిభ చూపుతోందనీ, వినూత్న, సృజనాత్మక ఆలోచనలు, దూరదష్టి గల నేతత్వం, అసాధారణ నాయకత్వ నిపుణతతో, వ్యాపార నియమాలను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ముందుకు పోతోందనీ, అలాగే సామాజిక బాధ్యతా (సి.ఎస్.ఆర్.) కార్యక్రమాలలో సైతం ఉత్తమ సేవలందిస్తోందనీ, ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొన్న తమ పరిశోధనా విశ్లేషణా విభాగం వారు ”మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” కు సింగరేణి సి.ఇ.ఓ.ను ఎంపిక చేసినట్లు నిర్వాహకుల తరపున కో-ఆర్డినేటర్ మిస్ అన్నా జోన్స్ ప్రకటించారు. సంస్థ సి.ఇ.ఓ.గా ఎన్.శ్రీధర్ కంపెనీ అభివద్ధికై ఉత్తమ నిర్వాహణ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యోగులకు, వినియోగ దారులకు అత్యుత్తమ సేవలందించడం ప్రశంసనీయమని శ్లాఘించారు.అవార్డు స్వీకరించిన సందర్భంగా సింగరేణి ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి, దీనికోసం అమలుచేస్తున్న విధానాలు, తదితర అంశాలను వివరించారు. సింగరేణిలోని అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషి, పట్టుదల వల్లనే సంస్థ ఈ స్థాయికి చేరుకోగలిగిందని ఆయన పేర్కొనగా సభికుల నుండి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
భారత బొగ్గు పరిశ్రమపై ప్రసంగం
అంతకు ముందు జర్మనీ దేశంలోని మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ట్రేడ్ ఫెయిర్-బవుమా’లో ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంపై ”ఇండియా డే సింపోజియమ్” లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని, ”దేశంలోని బొగ్గు పరిశ్రమ – ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు” అనే అంశంపై ప్రసంగించారు.
సింగరేణి సంస్థ సాధిస్తున్న ప్రగతిని ఆయన వివరించారు. ఈ ట్రేడ్ ఫెయిర్‌లో 58 దేశాలకు చెందిన 3,500 కంపెనీల వారు అత్యాధునిక మైనింగ్ సాంకేతికత, కొత్త యంత్రాలు, కొత్త సాధనాలను తమ స్టాల్స్‌లో ప్రదర్శించారు.