tsmagazine
గౌరవనీయులు శాసనమండలి అధ్యక్షులు, గౌరవ అసెంబ్లీ స్పీకర్‌, గౌరవ శాసనమండలి, శాసనసభ సభ్యులకు నమస్కారాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులందరికీ హదయ పూర్వక శుభాకాంక్షలు. మీ పదవీ కాలం దిగ్విజయంగా సాగాలని, మీరంతా అంకితభావంతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని మనసారా అకాంక్షిస్తున్నాను. ఎన్నికల అనంతరంకొలువుదీరిన ఈ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
tsmagazine

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో

తొలిప్రభుత్వం ఏర్పడింది.

సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసాన్ని, ఇతర నష్టాలను పరిగణనలోకి తీసుకుని, ఆనాటి పరిస్థితుల్లో అవలంబించవలసిన పంథాను నిర్ధేశించుకుని ప్రభుత్వం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది.పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. జటిలంగా మారిన విద్యుత్తు సంక్షోభం పరిష్కరించే చర్యలు చేపట్టింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది. పరిశ్రమలు, ఐటి రంగ విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. కూలిన కులవత్తులను నిలబెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసింది. వ్యవసాయం దండుగ అని నిరాశ నిస్పహలలో కూరుకుపోయిన రైతాంగానికి ధైర్యం, స్థైర్యం కల్పించే చర్యలు తీసుకున్నది.

పటుతరమైన పరిపాలనా విధానంతో కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, అవినీతి రహితమైన పరిపాలన అందించడంలో నా ప్రభుత్వం గొప్ప విజయం సాధించింది. తత్ఫలితంగా రాష్ట్రం సొంత ఆదాయ వనరులు గణనీయంగా అభివద్ది చెందినాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మరే రాష్ట్రానికి సాధ్యం కాని స్థాయిలో ఆర్థిక వద్ధిని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2014 నుంచి 2018 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వద్ధిరేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెల నాటికి 29.93 శాతం ఆదాయాభివద్ధి రేటు సాధించిందని సగర్వంగా సభకు తెలియచేస్తున్నాను.జి.ఎస్‌.టి. వసూళ్లలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

తెలంగాణాకు ఉన్న ప్రత్యేక పరిస్థితులను దష్టిలో

ఉంచుకొని నిస్సహాయులైన ప్రజానీకానికి జీవన భద్రతను కల్పించవలసిన తక్షణ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. వద్ధులు, వితంతువులు, తదితర వర్గాల వారికి కంటి తుడుపుగా కొంత మొత్తం పించన్ల రూపంలో అందేది. కాని నా ప్రభుత్వం వారికి ఇచ్చే పించన్ల మొత్తాన్ని గణనీయంగా పెంచింది. వారికనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా 1000 నుండి 1500 రూపాయల వరకు అందిస్తూ వచ్చింది. పేద ఆడ పిల్లల పెండ్లికి ప్రభుత్వం ద్వారా లక్ష నూట పదహార్లు సహాయం అందించే కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్‌ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజా సంక్షేమానికి అత్యధిక శాతం బడ్జెట్‌ వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ప్రత్యేక గుర్తింపును పొందింది. నా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, భరోసాను కలిగించాయి. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజల దీవెనల వల్ల టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వానికి మరోసారి అధికారం లభించింది.

దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటింటికీ ప్రభుత్వమే నల్లా సౌకర్యం కల్పించి, పరిశుద్ధమైన తాగునీటిని అందించే బ హత్తర పథకం మిషన్‌ భగీరథను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 66 మున్సిపాలిటీలకు, 23,968 జనావాసాలకు సురక్షిత నీరు అందించడం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది. ఇప్పటికే 56 మున్సిపాలిటీలకు, అన్నిఆవాస ప్రాంతాలకు మిషన్‌ భగీరథ ద్వారా ప్రస్తుతం మంచినీళ్లు అందుతున్నాయి. 18,612 జనావాసాలలో ప్రతీ ఇంటికి నల్లాలు బిగించి, మంచినీరు అందించబడుతున్నది. మిగతా మున్సిపాలిటీలు, ఆవాసాల్లో అంతర్గత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి మిషన్‌ భగీరథ పనులు వందకు వంద శాతం పూర్తి చేసి, ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ బహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మిషన్‌ భగీరథ ఉద్యోగులందరికీ మనసారా అభినందనలు తెలుపుతున్నాను.

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం భారీ నీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ప్రతీప శక్తుల ప్రతీఘాత చర్యలను, రాజకీయ దురుద్దేశంతో వేసిన బూటకపు కేసులను, వాటివల్ల వచ్చిన ఆటంకాలను ప్రభుత్వం అకుంఠిత దీక్షతో అధిగమించింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనా అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికారిక సంస్థల నుంచి పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు అటవీ, పర్యావరణ అనుమతులను ఇటీవలనే సాధించుకున్నామనే శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నాను. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అన్ని అనుమతులు సాధించడానికి ప్రభుత్వం తీవ్రంగా కషి చేస్తున్నది. వస్తాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. తెలంగాణ వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర జలసంఘం ప్రభుత్వ కషిని ఎంతగానో కొనియాడింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే గోదావరి నది ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ప్రాజెక్టు పనులను సందర్శించి, నిర్దేశిత సమయం వరకు ప్రాజెక్టు పూర్తి చేసి, నీరందించడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాలనే కతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా ధ్వంసం చేసిన చెరువులను పునరుద్ధరించేందుకు చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఇప్పటికి నాలుగు దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. ఈ చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే మిషన్‌ కాకతీయ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజేందర్‌ సింగ్‌ మిషన్‌ కాకతీయ ద్వారా బాగుపడిన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ చెరువులో పుట్టిన రోజు జరుపుకుని మరీ ప్రశంసించడం విశేషం.నీటి పారుదల రంగానికి గడిచిన నాలుగున్నరేళ్లలో 77,777 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. రాబోయే కాలంలో 1,17,000 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేస్తుంది.

నిరంతరాయంగా విద్యుత్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్‌ రంగం అధ్యాన్నస్థితికి చేరింది. తీవ్రమైన కరెటు కోతలు, కరెంటు షాకులతో రైతుల బలవన్మరణాలు, పేలిపోయే ట్రాన్స్‌ ఫార్మర్లు, కాలిపోయే మోటార్లతో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ప్రకటించడం, విపరీతమైన కోతల వల్ల పరిశ్రమలు మూతపడే దుస్థితి వచ్చింది. కరెంటు కోసం పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలకు దిగేవారు. గహాలకు కూడా గంటల తరబడి కోతలు విధించేవారు. తెలంగాణ వచ్చే నాటికి తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదవ నెల నుంచే నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు 28వేల మెగావాట్లు స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 800 మెగావాట్ల కెటిపిఎస్‌ 7వ దశ నిర్మాణాన్ని కేవలం 42 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి, విద్యుత్‌
tsmagazine

ఉత్పత్తి ప్రారంభించింది. 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్‌ ప్లాంటు ఈ ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తెలియ చేయడానికి సంతోషిస్తున్నాను. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రామెగా పవర్‌ ప్లాంటు నిర్మాణ పనులు వేగంగా జరగుతున్నాయి. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 5వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికి 3,613 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. దేశంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం మాత్రమే ఉండేది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన కషి వల్ల తెలంగాణలో 16,503 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించిన వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రగతి సూచికల్లో ముఖ్యమైన తలసరి విద్యుత్‌ వినియోగం వద్ధిరేటులో దేశంలోనే ప్రథమంగా నిలిచింది. దేశంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం అద్భుత విజయాలు సాధించేందుకు కషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యుత్‌ సంస్థల ఉద్యోగులందరికీ హదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.

కుదుటపడిన వ్యవసాయం

సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. వ్యవసాయం దండుగ అనే నిరాశ నిస్పహల నుంచి రైతులను బయట పడేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతాంగానికి గొప్ప ఊరట నిచ్చాయి. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతుల కరెంటు కష్టాలు తీరాయి. ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. కల్తీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు చేపట్టింది. కల్తీలు, నకిలీలకు పాల్పడే వారిపై పిడి యాక్టు నమోదు చేయడానికి ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కల్తీకి పాల్పడే వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.

రైతుబంధు

పంట కాలంలో పెట్టుబడి కోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం ఉండకూడదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రైతులకు పెట్టుబడి కోసం ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు దక్కుతుండంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. రైతుబంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్‌ మోడల్‌ పథకంగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ప్రముఖ వ్యవసాయార్ధిక నిపుణులు అశోక్‌ గులాటి లాంటి వాళ్లు వ్యవసాయ సంక్షోభానికి రైతుబంధు తరహా పథకం మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల పెట్టుబడి సమస్యను తీర్చిన రైతుబంధ నేడు జాతీయ ఎజెండాగా మారింది. మీడియాలో , వివిధ వేదికల్లో జరుగుతున్న చర్చల్లో తెలంగాణ మోడల్‌ అనే మాట విరివిగా వినపడుతుంటేతెలంగాణ బిడ్డలు గర్వపడుతున్నారు.

రైతుబీమా

దురదష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు రైతుబీమా పథకం కింద సహాయం అందించింది. వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం రైతు వేదికలు నిర్మాణం తలపెట్టింది.

భూరికార్డుల ప్రక్షాళన

భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం,భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కషితో దాదాపు 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
tsmagazine

గొర్రెల పంపిణీ

గొల్ల, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికులు, విశ్వకర్మలు, చాకలి, మంగలి తదితర కులాల సోదరులు మన తెలంగాణకున్న గొప్ప మానవ సంపద. సమాజానికి వీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. గొల్ల కుర్మలకు పెద్దఎత్తున గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం ప్రారభించింది. ఇప్పటికే 75 లక్షల గొర్రెలు పంపిణీ చేసింది. పెరిగిన జీవ సంపదతో ఇప్పటికే 1,200 కోట్ల రూపాయల కు పైగా ప్రయోజనం గొల్ల కుర్మలకు చేకూరింది. గొర్రెలకు కావలసిన దాణా కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీచేస్తుండటంతో గొల్లకుర్మలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ దేశంలో గొర్రెలతో పాటు ఇతర పశువులకు సత్వర వైద్య సేవలు అందించడం కోసం 100 సంచార పశువైద్యశాలలు నడుపుతున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ మాత్రమే అని చెప్పడానికి గర్విస్తున్నాను.

చేపల పెంపకం

రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తున్నది. అన్ని జలాశయాల్లో కోట్లాది చేప పిల్లలను వదులుతున్నది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. భవిష్యత్తులో మత్స్య పరిశ్రమను మరింత అభివద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

చేనేతకు ప్రోత్సాహం

చేనేత కళకు తెలంగాణా పెట్టింది పేరు. గద్వాల, నారాయణ పేట, పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల నేత ఉత్పత్తులు నేటికీ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కాలమాన పరిస్థితుల వలన కొంత, సమైక్య పాలనలో ప్రదర్శించిన నిరాదరణ వల్ల కొంత చేనేత రంగం భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలయ్యారు. చేనేత, పవర్‌ లూం కార్మికుల స్థితి గతులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వివిధ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. నేత కార్మికులు నేసె వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. విద్యార్థులకు, పోలీసులకు, ఇతర సంస్థల ఉద్యోగుల యూనిఫారాలు, బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంచే చీరల కోసం చేనేత ఉత్పత్తులను అదే విధంగా పవర్లూం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. చేనేత వారికి మరియు మరమగ్గాలవారికి నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నది. మార్కెట్‌ సదుపాయాలను మెరుగుపరిచి, కార్మికులకు కనీస ప్రతిఫలం దక్కే విధంగా చర్యలు తీసుకున్నది. చేనేత ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పిస్తున్నది. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వరంగల్‌లో మెగా టెక్స్‌ టైల్‌ పార్కు నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్‌ టైల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తున్నది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. కుల వత్తుల మీద ఆధారపడి జీవించే బీ సి కులాల జీవితాలు కుప్ప కూలి పోయినాయి. ఈ వృత్తులకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బిసిల స్థితిగతులను మార్చాలని తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలని ప్రభుత్వం భావించింది. తెలంగాణా ప్రభుత్వం భారతదేశంలో మరే రాష్ట్రంలో కూడా అమలు చేయని గొప్ప కార్యక్రమాలను బిసిల కోసం రూపొందించి అమలు చేస్తున్నది.

ఇతర కులాలకు ప్రోత్సాహం

నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మ ణులకు, బట్టలు ఉతికే అధునాతన యంత్రపరికరాలు కొనుగోలు చేసేందుకు రజకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. కల్లుగీత వ త్తిని ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టింది. అంతేకాకుండా చెట్ల పన్నును పూర్తిగా రద్దుచేసింది. ప్రమాదవశాత్తూ గీతకార్మికులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచింది. సంచార కులాలు, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారికోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఎం.బి.సి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.

ప్రజారోగ్యం

పేదలకు మెరుగైన వైద్యం లభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వా సుపత్రుల్లో వసతులను ఎంతో అభివద్ధి పరిచింది. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేట్టు చేసింది. ప్రభుత్వ దవాఖానాలలో కావల్సిన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొనుగోలుకు కేటాయించే బడ్జెట్‌ ను మూడింతలు పెంచి, ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా అందివ్వడానికి అందుబాటులో ఉంచింది. 40 ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎం.ఆర్‌.ఐ, సిటీస్కాన్‌, డిజిటల్‌ రేడియాలజీ, టూ డి ఎకో, తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చింది. జిల్లా, ఏరియా ఆస్పత్రులలో ఐ.సి.యు కేంద్రాల సంఖ్య కూడా పెంచడం జరిగింది.ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు మన రాష్ట్రానికి పలు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి.
tsmagazine

హైదరాబాద్‌ నగరంలో వైద్యసేవలను మరింత విస్తరించి, పేదలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్థారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా నాలుగు వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేట, మహబూబ్‌ నగర్‌ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. సూర్యాపేట, నల్గొండలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమ వుతాయి. ఒక్కో వైద్య కళాశాలకు అనుబంధంగా 750 పడకల ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాం. ఆసుపత్రిలో

మరణించిన వారి మతదేహాలను ఉచితంగా తరలించడా నికి ప్రభుత్వం పరమపద వాహనాలను ప్రవేశ పెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ ప్రభుత్వం మానవీయ దక్పథంతో ఈ వాహన సేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చింది.

విద్యారంగం

విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం చక్కగా ముందడుగు వేస్తున్నది. కేజీ టు పిజి ఉచిత విద్యావిధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వర్గాలకి చెందిన విద్యార్థులకోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే అరకొర వసతులతో ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని హంగులతో, రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బిసిల కోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున లక్షా 20వేల రూపాయలు వెచ్చిస్తూ, మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పించింది. విదేశీవిద్య కోసం వెళ్ళేవారికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నది.

కేసీఆర్‌ కిట్స్‌

ఆసుపత్రులలో సురక్షిత ప్రసవాలు జరగాలనే ప్రధాన లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పథకం కెసిఆర్‌ కిట్స్‌. ఈ పథకం క్రింద నిరుపేద గర్భిణులకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది. దీనితోపాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావల్సిన 16 రకాల వస్తువులతోకూడిన 2,000 రూపాయల విలువైన కిట్‌ ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు, సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ జరుగుతున్నది. ఇప్పటికే లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

గర్భవతులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒకపూట సంపూర్ణ ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలద్వారా అందిస్తున్నది. ఐరన్‌, తదితర మందుల పంపిణీ కూడా జరుగుతోంది.

కంటి వెలుగు

దష్టిలోపంతో బాధపడే వారికి కంటి వైద్యాన్ని చేరువలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకం ప్రారంభించింది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని అన్ని డివిజన్లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు,అద్దాలు అందిస్తున్నది. శస్త్ర చికిత్సలు జరిపిస్తున్నది.

పరిపాలన సంస్కరణలు

ప్రజలకుపరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలను విజయ వంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచడం కోసం, 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయితీలుంటే, కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి.

గ్రామ పంచాయతీలుగా తండాలు

మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. వారి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,326 ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.వీటికి తోడు 1,311 గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్‌ ఏరియాలోనే ఉన్నాయి. ఇతర గ్రామ పంచాయతీల్లోనూ ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3వేల మంది ఎస్టీలు రాష్ట్రంలో సర్పంచులుగా అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశంలో ఎస్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున పంచాయతీను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇది అభ్యుదయ పంథాలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయం. మరింత పకడ్బందీగా శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీసు కమీషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీస్‌ కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్‌ కమీషనరేట్లన్లను నెలకొల్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పోలీస్‌ కమీషనరేట్లున్నాయి. కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్‌ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్‌ సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు, పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది.

కొత్త జోనల్‌ వ్యవస్థ

తెలంగాణా సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్‌ కేడర్‌ ఉద్యోగాలలో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించే విధంగా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ కేడర్‌ తో పాటు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే తెలంగాణలోనియామకాలు జరుగుతాయి.

పారిశ్రామికాభివృద్ధి

రాష్టంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకువచ్చే వారికి టి.ఎస్‌ – ఐ.పాస్‌ సింగిల్‌ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా వుంది. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పరిశ్రమల స్థాపనకు లభిస్తున్నాయి. ఇప్పటి దాకా 8వేల పరిశ్రమలకు ఈ విధానం ద్వారా అనుమతులు లభించగా అందులో 5,570 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించినాయి. లక్షా ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చినయి. 8.37 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఖాయిలా పడిన కాగజ్‌ నగర్‌ సిర్పూర్‌ మిల్లును ప్రభుత్వం పూనుకొని పునరుద్ధరించింది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఖాయిలా పడిన ఇతర పరిశ్రమలను తెరిపించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇ.ఎన్‌.టి – దంత పరీక్షలు

కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకం అమలు కోసం ప్రాథమికమైన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించింది

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు

నిరుపేదలకు గహనిర్మాణం పథకం అమలుచే యడంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పథకం క్రింద ఇప్పటి వరకు 2, 72, 763 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది.ఇండ్ల నిర్మాణంసాగుతున్నది. బలహీనవర్గాల గహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులు గతంలో చెల్లించవలసి వున్న 4వేల కోట్ల రూపాయల రుణబకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది.

ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా..

తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్‌ ప్రముఖ ఐ.టి హబ్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నూతన ఐ.టి విధానంతోపాటు, సింగిల్‌ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐ.టి రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్‌ దేశవ్యాప్తంగా సంచలనం స ష్టించింది. ఐ.టి ఎగుమతులు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐ.టి. పరిశ్రమను రాష్ట్రం లోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది.

సజావుగా శాంతిభద్రతలు

పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతున్నది. అభివద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రభుత్వం పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలిస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం కానున్నది. శాంతి భద్రతలతో పాటూ ప్రకతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలను ఈ సెంటర్‌ ద్వారా నిశితంగా పర్యవేక్షించటానికి వీలవుతుంది. పోలీస్‌ శాఖ పేకాట, గుడుంబా వంటి దురాచారా లను సమర్ధవంతంగా అరికట్టగలిగింది. డ్రగ్స్‌, కల్తీల నిరోధానికి ఉక్కుపిడికిలి బిగించింది. షీ టీమ్స్‌ కషి ఫలితంగా మహిళలకు భద్రత ఏర్పడింది. శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలుపుతున్న పోలీస్‌ శాఖ ఉద్యో గులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను.

ప్రజా సంక్షేమం, అభివద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మెరుగుదలను సాధించగలిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నేతత్వంలోని ప్రభుత్వం సమర్థవంతమైన పరిపాలన వల్ల రాష్ట్రం దేశంలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తున్నది. అందువల్లనే గత ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని పెద్ద ఎత్తున ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. మూడింట నాలుగు వంతులు మెజారిటీ స్థానాలు గెలిపించి, తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ విజయాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ, నా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

అవసరమైన అర్హులకు అందించే ఆసరా పెన్షన్లను 1000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు, దివ్యాంగులకు 1500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. వ ద్దాప్య పెన్షన్‌ పొందే అర్హత వయో పరిమితిని సడలించి, 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెంచిన పెన్షన్లను అందించబోతున్నది. నిరుద్యోగ సోదరులకు నెలకు 3,016 రూపాయల భతి అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుత పద్ధతిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలంఉన్నఅర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూంఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది. రైతులకు రూ.1 లక్షవరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.ఈ సంవత్సరం నుంచే రైతుబంధు సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8 వేల నుంచి 10వేలకు పెంచి, అందిస్తుంది. రైతుసమన్వయసమితి సభ్యులకు గౌరవ భతి అందించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది.

రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రభుత్వం, మహిళా సంఘాలు, ఐకెపి ఉద్యోగుల సంయుక్త నిర్వహణలో ఈ యూనిట్లు పనిచేస్తాయి. సందర్భోచితంగా ఐకెపి ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేస్తుంది.

గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం మానిఫెస్టోలో ప్రకటించకుండానే అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. అదే విధంగా రానున్న ఐదేళ్లలోనూ రాష్ట్రం సమగ్రాభివద్ధిని దష్టిలోఉంచుకుని, ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన లక్ష్యాలను, ప్రణాళికలను, పథకాలను నిర్దేశించుకుంటూ ప్రభుత్వం పురోగమిస్తుందని తెలియ చేస్తున్నాను. ప్రజల బతుకుల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు అందించిన అపూర్వ విజయం పునాదిగా నా ప్రభుత్వం పునరంకితమవుతున్నది ఈ ఉభయ సభల సాక్షిగా నిండు విశ్వాసంతో ప్రకటిస్తున్నాను.

జై హింద్‌ జై తెలంగాణ

Other Updates