మన పిల్లల కోసం ఎన్ని ఆస్తులు కూడబెట్టాం అన్నది ముఖ్యం కాదు, మంచి బతుకు బతికేందుకు నివాసయోగ్యమైన వాతావరణం కల్పిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం – ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు

తెలంగాణకు హరితహారం ఎందుకు, ఎవరికోసం, హరితహారం వల్ల ఉపయోగం ఎంత ఇలా అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి చెప్పిన రెండు వాక్యాలు సమాధానం ఇస్తాయి. పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను ఎలా మల్చుకోవాలి, అందరూ చెప్పే అభివద్ధి, సంక్షేమానికి తోడుగా అదనంగా ఏం చేయొచ్చు, లాంటి ముఖ్యమంత్రి ఆలోచనల్లోంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. మొక్కలు నాటుదాం, చెట్లు పెంచుదాం, చల్లగా ఉందా, భవిష్యత్‌ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇద్దాం. రాష్ట్రాన్ని మెరుగైన వాతావరణం ఉండే ఆవాసయోగ్యమైన తెలంగాణగా మలుచుకుందాం.. ఇలాంటి పదాలను కేసీయార్‌ చెప్పినన్ని సార్లు, జనం బుర్రలోకి హరితహారం ప్రాధాన్యతను ఎక్కించేందుకు ఆయన చేసినన్ని ప్రయత్నాలు బహుశా మరే ముఖ్యమంత్రి, ఇతర నాయకులు చేసి ఉండరు. అభివద్ధి, సంక్షేమం ఇతర పార్టీలకు కేవలం ఓట్ల రాజకీయం అయినప్పుడు ఒక్క తెలంగాణ ఎందుకు హరితహారంలో వెనుకపడింది అంటే అక్కడే ఉంది అసలు మతలబు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా మారింది. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన అడవులు, పచ్చదనం, పర్యావరణాన్ని పణంగా పెడుతూ సమాజం సో కాల్డ్‌ డెవలప్‌ మెంట్‌ వైపు మార్చ్‌ ఫాస్ట్‌ చేస్తోంది. దీని పర్యవసానమే మండుతున్న ఎండలు, అపసవ్య వర్షాలు, అంతుపట్టని వాతావరణ మార్పులు. ఈ వైరుధ్యాల మధ్య, మరి మనం ఏం చేయాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏ వైపుగా ప్రయాణం చేయాలి, అభివద్ధి, సంక్షేమంతో పాటు పర్యావరణ సమతుల్యం అవసరమనే యావ అందరిలో రావాలి. అందుకే తెలంగాణకు హరితహారం. ఏ ప్రాంతంలోనైనా దాని విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉంటే భౌగోళికంగా పర్యావరణం బాగున్నట్లు లెక్క. మన తెలంగాణలో అడవులు, పచ్చదనం శాతం 24 మాత్రమే. దీనిని 33 శాతంగా పెంచుకునే బహత్‌ ప్రయత్నమే తెలంగాణకు హరితహారం. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పచ్చదనం పెంపు ప్రయత్నమనే ప్రశంసలు అందుకుంటోంది.

అడవులకు పర్యావరణానికి అంతర్గత సంబంధం తెలిసిందే. సరైన పచ్చదనం ఉంటేనే వాతావరణం అదుపులో ఉంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అడవుల్లో ఉండాల్సిన జంతువులు అక్కడే ఉంటాయి. ప్రజలకు కోతుల బాధలు, రైతులకు అడవి జంతువుల వల్ల ఇబ్బందులు తప్పుతాయి. అంటే ఎవరి ఆవాస ప్రాంతాల్లో వాళ్లు బతుకుతారు. జనావాసాలపై జంతువుల దాడి, అడవులపై జనం భారం తగ్గుతాయన్న మాట. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏడాదికేడాది పెరుగుతున్న ఎండలు జనాలకు చుక్కలు చూపుతున్నాయి. 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఎండలు, రానున్న రోజుల్లో యాభై డిగ్రీలకు చేరినా ఆశ్చర్యంలేదు. ఈ ఎండలకు మందు కూడా విరివిగా చెట్లను పెంచటమే. చక్కని పచ్చదనం, నిండైన వక్ష సంపద ఉన్న ప్రాంతాల్లో బయటకన్నా 3 నుంచి 5 డిగ్రీల తక్కువ వేడి నమోదవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకే రాష్ట్రం హరిత తెలంగాణ, ఆవాసయోగ్యమైన తెలంగాణ నినాదాన్ని తీసుకుంది. మాటలు చెప్పటమే కాదు, చెప్పిన దాన్ని మనసా వాచా ఆచరణలో పెట్టే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తాను అమల్లో పెట్టడంతో పాటు, ప్రజల మదిలోకి మొక్కలు, చెట్లు, పచ్చదనం ఎక్కించే ప్రతీ సందర్భాన్ని చక్కగా వాడుతున్నారు.

2015-16లో మొదలైన తెలంగాణకు హరితహారం నాలుగు విడతలు పూర్తి చేసుకుని, ఐదో యేట నిర్వహణకు సిద్ధమౌతోంది. లక్ష్యం 230 కోట్ల మొక్కలు కాగా, ఇప్పటికే నూటాపదమూడు కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి హరితహారం ఒక బహత్‌ కార్యం. ప్రభుత్వమో, కొద్ది మంది వ్యక్తులో, కొన్ని సంస్థలో పూనుకుంటే సుళువుగా లక్ష్యాన్ని చేరలేం. సమాజంలోని ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు అయితేనే లక్ష్యం సిద్ధిస్తుంది. అదే సమయంలో ఒక్క రోజులోనే, ఏడాదిలోనో మరో తొమ్మిది శాతం పచ్చదనం సాధించటం సాధ్యం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ముఖ్య మంత్రి ఐదో విడత హరితహారం లక్ష్యాన్ని మరింతగా పెంచారు. ఈ ఏడాది గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు వంద కోట్ల మొక్కలను పెంచడం, 83 కోట్ల మేర మొక్కలు నాటాలనే భారీ ప్రణాళిక సిద్ధమైంది.

హరితహారాన్ని విమర్శించే వ్యక్తులు, పార్టీలు ఎవరైనా ఒక్కసారి పర్యావరణ రక్షణలో తమవంతుగా ఏం చేశారు. ఎన్ని మొక్కలు నాటారో, ఎన్నింటికి సంరక్షణ చేపట్టారో ఆలోచించుకోవాలి. తాము ఆచరించకుండా, వ్యవస్థపై నిందలు వేయడంపై పునరాలోచించుకోవాలి. హరితహారం ఫలాలు అందటం మొదలైంది. రోడ్ల వెంట, పార్కుల్లో, తగిన రక్షణ, నీటి వసతి ఉన్న ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీల్లో పెరిగిన పచ్చదనం కంటినిండా కనిపిస్తోంది. అన్నింటికన్నా ప్రజల్లో మొక్కల పెంపకంపై వచ్చిన అవగాహన పెద్ద విజయం, కన్నబిడ్డల్లా, కంటికి రెప్పలా ఇంటికి ఆరు మొక్కలు పెంచాలన్న ప్రభుత్వ నినాదం పనిచేస్తోంది. ఇష్టమైన కుంటుంబ సభ్యుల పేరుపై మొక్కలు నాటి పెంచి పెద్ద చేస్తున్న వైనం తెలంగాణ హరితహారం విజయం.

మొత్తం నాలుగేళ్లలో నాటినవి – 113.596
తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన ఇతర పర్యావరణ హిత కార్యక్రమాలు
తెలంగాణకు హరితహారం అంటే కేవలం మొక్కలు నాటే కార్యక్రమం ఒక్కటే కాదు. అటవీ శాఖ ద్వారా పచ్చదనం పెంపు, ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న అడవిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జంగల్‌ బచావో, జంగల్‌ బడావో నినాదం ఇచ్చారు. ఇకపై అడవిలో ఒక్క చెట్టూ నరకకుండా చూడాలని ఆదేశించారు. అటవీ శాఖలో సంస్థాగతంగా భారీ మార్పులు తెచ్చారు. శాఖ, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఒకేసారి సుమారు 200 మంది అధికారులను బదిలీ చేశారు. రెండు వేలకు పైగా కొత్త నియామకాలు చేశారు. కొత్త వాహనాలు సమకూర్చారు. పోలీసు శాఖ సహకారంతో కలప స్మగ్లింగ్‌ కు చెక్‌ పెట్టేందుకు కొత్తగా టాస్క్‌ ఫోర్స్‌ టీములు, కొత్త చెక్‌ పోస్టుల ఏర్పాటు జరిగింది. మరిన్ని కట్టుదిట్టమైన కఠిన నిబంధనలతో కొత్త అటవీ చట్టం ముసాయిదా సిద్ధమైంది.

సంవత్సరం నాటిన మొక్కలు (కోట్లలో)

2015- 16 15.861

2016-17 31.674

2017 -18 34.079

2018-19 31.982

హైదరాబాద్‌ చుట్టూ విస్తారంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో పట్టణ అటవీ పార్కుల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 59లో ఇప్పటికే పదహారు పార్కులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగతావి రానున్న నవంబర్‌ కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలకు సమీపంలో

ఉన్న పార్కులను అభివద్ధి చేయాలన్న సంకల్పం ఉంది. నిత్యం బిజీగా గడిపే పట్టణజీవులు ఉదయం, సాయంత్రం, సెలవు రోజుల్లో సేదతీరేందుకు అనువైన ప్రాంతాలుగా ఇవి పనిచేస్తాయి. అదే సమయంలో పిల్లా పెద్దలకు పర్యావరణంపై అవగాహన కల్పించే మార్గాలుగా కూడా ఈ అటవీ పార్కులు పనిచేస్తాయి. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో అడవుల ప్రాధాన్యతపై అవగాహన కలిగించేందుకు అటవీ, విద్యా శాఖలు సమన్వయంతో వన దర్శిని కార్యక్రమాన్ని చేపట్టాయి. అటవీ సంసదను, జంతుజాలాన్ని కాపాడేందుకు కూడా అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోంది. అలాగే హరితహారం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఈఏడాది ఆగ్రో ఫారెస్ట్రీ కింద గంధం, టేకు, వెదురు, సరుగుడు మొక్కలను పంపిణీ చేయనుంది.

ప్రభుత్వ పరంగా ఈ అన్ని ప్రయత్నాలకు తోడు ప్రజలంతా తెలంగాణకు హరితహారం కోసం పాటుపడి, మొక్కలు నాటడం, సంరక్షించటం, సమీప అటవీ ప్రాంతాల రక్షణ పట్ల బాధ్యతాయు తంగా వ్యవహరించటం, అడవికి హాని తలపెట్టే వారి సమాచారం సమీప అధికారులకు చేరవేయటం, ప్లాస్టిక్‌ వ్యర్థాల కట్టడికి తోడ్పడటం పౌరులందరిగా మన బాధ్యత. అప్పుడే నిజమైన తెలంగాణకు హరితహారం కల సాకారమౌతుంది.
-బందు శ్రీకాంత్‌ బాబు

Other Updates