ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) విజయవంతం అయిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. నాగార్జున సాగర్ జలాశయం నుండి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడమే కాకుండా శ్రీశైలం జలాశయం నుండి సొరంగం ద్వారా నీటిని తరలించే పథకం కూడా ప్రారంభం కావడంతో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజక వర్గాల ప్రజలు కష్ణా నీటిని తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలయ్యింది.
టన్నెల్ ద్వారా తరలించే ఈ నీటిని నాలుగు నియోజకవర్గాల్లో ఒక లక్ష ఎకరాలకు అందించే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేశారు. ప్రజల డిమాండ్ మేరకు ఎట్టకేలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదయసముద్రం ఎత్తిపోతల పథకానికి జూన్ 2007లో రూ.699 కోట్లకు పరిపాలనా అనుమతులు అందిస్తూ జివో నంబరు 143 ని జారీ చేసింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఉదయసముద్రం జలాశయం నుండి 6.70 టిఎంసిల నీటిని ఎత్తిపోసి నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 7 మండలాల్లోని (నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూరు) 107 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. నకిరేకల్ నియోజక వర్గం లో 62,477 ఎకరాలు, నల్లగొండ నియోజకవర్గంలో 24,469 ఎకరాలకు, మునుగోడు నియోజకవర్గంలో 10,270 ఎకరాలకు, తుంగతుర్తి నియోజకవర్గంలో 2,784 ఎకరాలకు, మొత్తం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం.
జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులకు జుూజ పద్ధతిన టెండర్లు పిలిచి 48 నెలల్లో పనులు పూర్తి చేయుటకు రూ. 561.96 కోట్లకు మైటాస్ – మెగా-కెబిఎల్‌తో కూడిన జాయింట్ వెంచర్‌కు పనులు 2008లో అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం సేకరించవలసిన భూమి 3,876 ఎకరాలుగా అంచనా వేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడే దాకా భూసేకరణ జరగనే లేదు. ప్రాజెక్టులో చేపట్టవలసిన ప్రధాన పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. అప్రోచ్ కాలువ : ఉదయసముద్రం జలాశయం నుండి వెలువడే ఈ గ్రావిటీ కాలువ పొడవు 6.90 కిలోమీటర్లు. ఈ కాలువ పై వివిధ స్ట్రక్చర్లు నిర్మించాలి.
2. సొరంగం : గ్రావిటీ కాలువ తర్వాత కి.మీ. 6.900 నుండి 17.525 కి మీ దాకా అంటే 10.625 కి.మీ. సొరంగం తవ్వవలసి ఉంటుంది. సొరంగం తవ్విన తర్వాత సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ కూడా చేయాలి
3. సర్జ్‌పూల్ : కి మీ 17.525 వద్ద 26 మీ పొడవు, 25 మీ వెడల్పుతో సర్జ్‌పూల్ నిర్మించాలి. సర్జ్‌పూల్ లోకి చెత్త చెదారం రాకుండా అడ్డుకునే ట్రాష్ ట్రాక్ గేట్లను నిర్మించాలి.
4. పంప్ హౌజ్ : కి మీ 17.550 వద్ద 30 మీ పొడవు, 16 మీ వెడల్పు, 93.877 లోతుతో రెండు 16 మె.వా. పంపులను బిగించడానికి పంప్ హౌజ్ నిర్మించాలి. పంప్ హౌజ్ నుండి రెండు పంపుల ద్వారా ఎత్తిపోసే నీటిని బ్రాహ్మణ వేల్లెమ్ల జలాశయానికి తరలించడానికి 2200 మి మీ వ్యాసం కలిగిన ప్రెషర్ మెయిన్స్ ఏర్పాటు చేయాలి. రెండు పంపులను వాటి అనుబంధ ఎలెక్ట్రో మెకానికల్ , హైడ్రో మెకానికల్ పరికరాలను బిగించాలి. ఒక్కొక్క పంపు డిస్చార్జ్ సామర్ధ్యం 975 క్యూసెక్కులు.
5. డెలివరీ మెయిన్స్ : 1.132 కి.మీ. పొడవున రెండు వరసల్లో 2200 మి.మీ. వ్యాసం కలిగిన డెలివరీ మెయిన్స్ ఏర్పాటు చెయ్యాలి.
6. డెలివరీ సిస్టేర్న్ : డెలివరీ మెయిన్స్ ద్వారా వచ్చే నీరు డెలివరీ సిస్టేర్న్ ద్వారా బ్రాహ్మణ వెల్లెమ్ల జలాశయానికి చేరుతాయి.
7. 220 కె.వి. సబ్ స్టేషన్ : పంపులు తిప్పడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం 220 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ ని నిర్మించాలి.
8. బ్రాహ్మణ వెల్లెమ్ల జలాశయం : ఉదయసముద్రం జలాశయం నుండి ఎత్తిపోసే నీటిని నిల్వ చేసి ఒక లక్ష ఎకరాలకు గ్రావిటీ కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలి. అందుకు వీలుగా 0.302 టిఎంసిల సామర్థ్యం కలిగిన బ్రాహ్మణ వెల్లెమ్ల జలాశయం నిర్మించాలని ప్రతిపాదించారు. జలాశయం కట్ట పొడవు 3.665 కి మీ. కట్టా పూర్తి స్థాయి మట్టము 298 మీ.
9. కుడి కాలువ, ఎడమ కాలువ, ఉప కాలువల నిర్మాణం : కుడి కాలువ పొడవు 25.530 కిలో మీటర్లు. ఉప కాలువల పొడవు 226.100 కిలోమీటర్లు . కుడి కాలువ కింద ఆయకట్టు 57,000 ఎకరాలు. ఎడమ కాలువ పొడవు 6.5 కిలో మీటర్లు. ఉపకాలువల పొడవు 149.36 కిలో మీటర్లు. ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు 43,000 ఎకరాలు. ఈ కాలువలపై అవసరమయ్యే స్ట్రక్చర్లను నిర్మించాలి.
పైన పేర్కొన్న పనుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వేగాన్ని పుంజుకొని పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయి. ఉదయసముద్రం నుండి బయలుదేరే అప్రోచ్ కాలువ పూర్తి అయింది. సొరంగ తవ్వకం మొత్తం పూర్తి అయ్యింది. సొరంగం లైనింగ్ ఇంకా 2.7 కిలోమీటర్లు మిగిలి ఉన్నది. సర్జ్ పూల్ పనులు పూర్తి అయినాయి. ట్రాష్ ట్రాక్ గేట్ల బిగింపు పనులు పూర్తి అయినాయి. పంప్ హౌజ్‌లో సివిల్ పనులు దాదాపు పూర్తి అయినాయి. పంపుల బిగింపు పనులు మొదలయినాయి. పంపుల బిగింపు పనులు మే చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులు కషి చేస్తున్నారు. డెలివరీ పైపుల పనులు చివరి దశలో ఉన్నాయి. డెలివరి పైపుల నుండి నీటిని బ్రాహ్మణ వెల్లెమ్ల జలాశయంలో పడవేయడానికి డెలివరి సిస్టేర్న్ పనులు పూర్తి అయినాయి. రెండు 16 మెగావాట్ల పంపు యూనిట్లకు సంబంధించి మోటార్లు, తదితర అన్ని రకాల ఎలెక్ట్రో మెకానికల్ మరియు హైడ్రో మెకానికల్ పరికరాలను తయారు చేయించి సైట్లోకి దిగుమతి చేసుకోవడం పూర్తి అయ్యింది. వాటి బిగింపు పనులు కొనసాగుతున్నాయి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే 220 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ పనులు 95 శాతం పూర్తి అయినాయి. వాటిని పరీక్షించడం, చార్జింగ్ మిగిలి ఉంది. నార్కట్‌పల్లి నుంచి సబ్ స్టేషన్ దాకా విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తి అయ్యింది.
ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న బ్రాహ్మణ వెల్లెమ్ల బ్యాలెన్సింగ్ జలాశయం చాలా కీలకమైనది. ఈ జలాశయం నిల్వ సామర్ధ్యం 0.302 టిఎంసిలు. 3.665 కి.మీ. పొడవుతో జలాశయం మట్టి కట్ట నిర్మాణం పూర్తి అయ్యింది. కుడి ఎడమ ప్రధాన కాలువల హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. వీటికి గేట్లను ఏర్పాటు చేసే పనులు పురోగతిలో ఉన్నాయి.
6.50 కి మీ ఎడమ కాలువలో 4 కి.మీ. పొడవు కాలువ తవ్వకం పూర్తి అయ్యింది. మిగతా కాలువ తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. 25.53కి. మీ. పొడవున్న కుడి కాలువలో 6 కి.మీ. కాలువ తవ్వకం మాత్రమే పూర్తి అయ్యింది. అయితే ఈ రెండు ప్రధాన కాలువల కింద డిస్ట్రిబ్యుటరీలు , ఉపకాలువల ద్వారా ఈ సంవత్సరం దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సాగునీటి శాఖ అధికారులు.(ఎడమ కాలువ కింద 32 వేల ఎకరాలకు, కుడి కాలువ కింద 18 వేల ఎకరాలకు) ఉప కాలువల పనులు చురుకుగా సాగుతున్నాయని అధికారులు సమాచారం ఇచ్చారు. మొత్తం ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కాలువల తవ్వకానికి అవసరమైన మొత్తం 3876 ఎకరాలు అవసరం అవుతాయి. నేటికి 1286 ఎకరాల భూసేకరణ మాత్రమే చేయగలిగినారు. మరో 2590 ఎకరాల భూసేకరణ వివిధ దశల్లో
ఉన్నది. ప్రాజెక్టు పనుల కోసం ఈనాటి వరకు 311 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. 64 శాతం పనులు పూర్తి అయినాయి. ప్రాజెక్టు పనులు మార్చ్ 2020 నాటికి పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఈ సంవత్సరం పాక్షికంగా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. చెరువులను నింపుతారు. నల్లగొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఈ సంవత్సరం సాకారం కాబోతున్నది.
– శ్రీధర్ రావు దేశ్ పాండే