మంజుల చకిలం

వరద సులభ భక్తవత్సల నరసింహా

నరమగవేష శ్రీనరసింహా

పరమపురుష సర్వ పరిపూర్ణ నరసింహా

గిరిగుహావాస సుగ్రీవనరసింహా

ఉగ్ర స్వరూపుడైన నారసింహుడు యాదరుషి తపస్సు ఫలితంగా యాదాద్రి గుహలో వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు. కతయుగంలో హిరణ్యకశ్యపునికి మోక్షం కలిగించేందుకు, ప్రహ్లాదుని కాపాడేందుకు అవతరించిన ఉగ్రనారసింహమూర్తి, అనంతరం ఋష్యశ్రుంగుని కుమారుడైన యాదమహార్షి తపస్సు ఫలితంగా యాదాద్రి కొండపై గుహలో పంచనారసింహ రూపాలలో వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు. పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రిలో వార్షిక బ్రహ్మూత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మాదిదేవతలు కలిసి బ్రహ్మూెత్సవాలను నిర్వహించినట్టుగా సకల దేవతల నివాసస్థలంగా పదకొండురోజుల పాటు యాదాద్రి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

మార్చి 8 నుండి 18 వరకు 11రోజుల పాటు బ్రహ్మూత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వస్తి వాచనం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ప్రారంభమైన బ్రహ్మూెత్సవాలు రెండవరోజున ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించారు. మూడవరోజు నుండి ఉదయం వివిధ అలంకారసేవలో, సాయంత్రం వివిధ వాహనసేవలలో భక్తులకు కల్యాణ మూర్తులుగా దర్శనమిచ్చారు. వేదపండితుల వేదపారాయణాలు, రుత్వికుల మూలమంత్ర పఠనాలు, ప్రబంధ పారాయణాలు ఒకవైపు, మంగళవాయిద్యాలు మరోవైపు మారుమ్రోగుతుండగా స్వామి, అమ్మవార్ల అలంకారసేవలలో బాలాలయం కల్యాణ మండపం నుండి ముఖమండపం వరకు సాగాయి.

మొదటిరోజు శ్రీమన్నారాయణుని మొదటి అవతారమైన వేదరక్షకుడైన మత్స్యావతార రూపంలో అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేషవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలంకారసేవలో రెండవదిగా భగవద్గీతతో సకల లోకాలకు మోక్షమార్గాన్ని చూపిన మురళీకష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా రాత్రి వేళలో హంసవాహనంపై స్వామి వారు ఊరేగారు. మరుసటిరోజు వటపత్రసాయి అలంకారంలో, కోరిన కోరికలు తీర్చే కల్పవక్షమైన పొన్నవాహనంపై బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు.


ఆరవరోజు గోవర్ధనగిరిధారి అలంకారంలో సాయంత్రం సింహవాహనం సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడవరోజు ఉదయం జగన్మోహిని అవతారంలో దర్శనమివ్వగా సాయంత్రం బ్రహ్మూత్సవాలలో ముఖ్య ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం జరిగింది. పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యాలు ధరించిన స్వామివారు అశ్వవాహనంపై ముత్యాల పల్లకిలో అమ్మవారిని వేంచేయింపచేసి ఎదుర్కోలు నిర్వహిం చారు. స్వామి, అమ్మవార్ల విశిష్టతను తెలియచేస్తూ పెళ్ళి సంబంధాన్ని ఖరారుచేసి లగ్న ఘడియలను నిశ్చయించారు. కల్యాణోత్సవం రోజున ఉదయం రామావతారంలో హనుమంతవాహనంపై దర్శనమివ్వగా అశేష భక్తజనం సేవలో పాల్గొని తరించారు. అనంతరం మొదట బాలాలయంలో దేవదేవుని కల్యాణం నిర్వహించారు.

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఈ కల్యాణోత్సవంలో విశిష్ట అతిథులుగా పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. రాత్రి 8గంటలకు కొండ క్రింద పాత జెడ్‌పిహెచ్‌ఎస్‌ స్కూల్‌లో లోక కళ్యాణార్ధం, విశ్వశాంతి కోసం కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దూరదర్శన్‌ యాదగిరి ఛానెల్‌ కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షప్రసారం చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ దంపతులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. చీఫ్‌ ఇన్ఫర్‌మేషన్‌ కమీషనర్‌ రాజాసదారామ్‌, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, డిసిపి నారాయణరెడ్డి, ఏసిపి మనోహర్‌ రెడ్డి, ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహాముర్తి తదితరులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

యాదాద్రి బ్రహ్మూత్సలో కల్యాణానికి ఎంతటి విశిష్టత ఉందో రథోత్సవానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. కల్యాణం జరిగిన మరునాడు స్వామి, అమ్మవార్లను విద్యుత్‌ దీపాలతో, పూలతో అలంకరించిన రథంపై కూర్చుండబెట్టి తిరువీధులలో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట దిగువన స్వామి వారి రథయాత్ర సాగింది. కళాకారుల నత్యప్రదర్శనలు, కోలాటాల నడుమ రథం తరలిరాగా భక్తులు గోవింద నామాలతో స్తుతిస్తు మంగళ హారతులు పట్టారు. పదిరోజుల పాటు బ్రహ్మూెత్సవాలలో అలసిసొలసిన స్వామి, అమ్మవార్లకు చక్రత్‌ ఆళ్వారులకు చల్లటి పన్నీటితో చక్రస్నానం చేయించి మహాపూర్ణాహుతి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇక చివరి రోజున మూలమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శంగారడోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి అయినాయి.

బ్రహ్మూెత్సవాలలో భాగంగా ప్రతీ రోజు కళాకారులచే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలతో సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భక్తులనెంతో అలరించాయి.

ఇందు గలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే !!

Other Updates